కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో 42 లోక్‌సభ సీట్లకు గానూ 35కు పైగా సీట్లలో బీజేపీని గెలిపించాలని బెంగాలీలకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బీజేపీ అన్ని సీట్లను సాధిస్తే.. 2025 తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, అమిత్ షా శుక్రవారం బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా బెంగాల్‌లో పలుచోట్ల ఘర్షణల అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీపై షాకింగ్ కామెంట్స్‌చేశారు. మమతా బెనర్జీ హిట్లర్ తరహా పాలనను నడుపుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్ బీజేపీ ప్రభుత్వం వస్తే.. శ్రీరామనవమి ర్యాలీల్లో దాడులు ఉండవంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో మరో బాంబ్ పేల్చారు అమిత్ షా. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని బెంగాల్‌కు సీఎంని చేయాలని మమతా బెనర్జీ కలలు కంటున్నారని అన్నారు. కానీ, బెంగాల్‌లో తదుపరి సీఎం బీజేపీ నుంచే అవుతారని వ్యాఖ్యానించారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. అమిత్ షా పర్యటన వేళ బెంగాల్‌లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. బీర్‌భూమ్ జిల్లాలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ కారులో 3400 డిటోనేటర్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గుస్లారా బైపాస్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ స్కార్పియో కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో డిటోనేటర్లు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌ను పిలిపించి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment