
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ బెట్టింగ్ రాయుళ్లు పేట్రేగిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. పలువురు బుకీలు అదే పనిలో మునిగిపోయారు. రాష్ట్రంలో బుకీలు తమ దందాను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రతి పార్టీకి ఒక్కో రేటు పెట్టి బుకీలు బెట్టింగులకు తెరదీస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల బెట్టింగ్ మార్కెట్ దాదాపుగా రూ. 800 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్‌ల్లో కూడా పలు ట్విస్టులు, మార్పులు కొనసాగుతున్నాయి. ఇటీవల పలు ప్రీ పోల్ సర్వేలు కర్ణాటకలో హంగ్ వస్తుందంటూ పేర్కొనడంతో 95 పైసల వరకు రేటు పడిపోయినట్లు సమాచారం. ప్రీ పోల్ సర్వేల ముందు వరకు బెట్టింగులన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి.
బీజేపీ 113 స్థానాల్లో గెలుస్తుందనే ఊహగానాల మధ్య ఆ పార్టీకి సానుకూలంగా బెట్టింగ్ చేశారు. ప్రస్తుతం బీజేపీ మీద రూ. 10 బెట్టింగ్ వేస్తే ఆ పార్టీ గెలిస్తే అదనంగా రూ. 11 ఇస్తారు. ఆ రేటు ప్రకారమే బీజేపీకి బెట్టింగ్ నడిచింది. అదే కాంగ్రెస్ గెలిస్తే ప్రతి రూపాయికి అదనంగా రూ. 2.5 దక్కుతుంది. అదే జేడీఎస్ గెలుస్తుందని రూ. 1 బెట్టింగ్ వేస్తే దానికి అదనంగా రూ. 6 అందజేయనున్నట్లు సమాచారం. బుకీల లెక్కప్రకారం ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అతి ఎక్కువ స్థానాలు గెలుచుకునే పార్టీగా ఉండబోతోందని సమాచారం అందుతోంది. అయితే బెట్టింగ్ రాయుళ్లకు విరుద్ధంగా సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలవబోతున్నట్లు సర్వేలు నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్లవద్దని పోలీసు శాఖ ప్రజలకు సూచిస్తుంది. బెట్టింగ్ రాయుళ్ల వివరాలు తెలిసిన వారు సమాచారం అందజేయాలని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment