సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీ ఎట్టకేలకు అమరావతికి చేరింది. సైకిల్ ర్యాలీ సందర్భంగా రాళ్లదాడి ఘటనపై అమరావతి రావాల్సిందిగా ఏపీ పర్యాటక శాఖమంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి అధిష్టానం నుంచి ఆదేశాలు అందిన విషయం విదితమే. దీంతో ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదంటూ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు.
కాగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఇటీవల చోటుచేసుకున్న వరుస సంఘటనలపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...వారిద్దర్నీ బుధవారం సాయంత్రం అమరావతికి వచ్చి కలవాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే సీఎం కలవమని చెప్పిన ఒకరోజు ముందే ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ రచ్చకెక్కడం గమనార్హం. ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చల్లారకముందే ...మంగళవారం రాత్రి అఖిలప్రియ చేపట్టిన సైకిల్ యాత్ర అలాంటి వాతావరణాన్నే పునరావృతం చేసింది. అయితే పోలీసుల పర్యవేక్షణలో చివరకు సైకిల్‌యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment