వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినంగా భావించి ఆయన విగ్రహాల వద్ద నిరసన తెలపాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 14న రాజ్యాంగ పరిరక్షణ దినంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేయడంతో పాటు నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే అవిశ్వాస తీర్మానం నోటీసులపై చర్చ జరగకుండా చేశారని, పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చకున్నా టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు.
శవాలు కూడా కనిపించకుండా హత్యలు
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికానని, కత్తిలాంటి వాణ్నని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే. చంద్రబాబు నిప్పే. అమరావతిలో అరటితోటలను కాల్చిన నిప్పు చంద్రబాబు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కత్తి ఏపీ సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. దివంగత నేత వంగవీటి మోహనరంగాను హత్య చేయించింది చంద్రబాబేనని అప్పటి హోం మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాసినట్లు ఈ సందర్భంగా భూమన గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు శవాలు కూడా కనిపించకుండా హత్యలు చేయించిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. చంద్రబాబులాంటి అవినీతి సామ్రట్ మరొకరు లేరని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుది శల్య సారథ్యం
ప్రత్యేక హోదాను ఇస్తామన్న హామీని దగగా మార్చారని, హోదా హామీ మాటలకు చంద్రబాబు సమాధి కట్టారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రుల జీవితాలను బుగ్గిపాలు చేసిన చంద్రబాబుకు అనవసర ఆర్భాటమే ఎక్కువని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిందేమీ ఉండదని, కేవలం చెప్పడమేనన్న భూమన.. తనకు అనుకూల ఎల్లో మీడియా ద్వారా హోదాపై పోరాడుతున్నట్లు ప్రచారం చేయిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి చంద్రబాబు శల్యుడు లాంటి వారని, సారథిగా ఉన్నట్లు నటించే యత్నం చేస్తూ ఉద్యమాన్ని నీరు గార్చాలని చూస్తున్నారని భూమన పేర్కొన్నారు. శకుని లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయని.. అమ్మని చంపి తాను అనాథను అని ఏడ్చినట్లు హోదా ఉద్యమాన్ని అణిచివేసి ఇప్పుడు తానే పోరాడుతా అని చెప్పడం నిజంగా విడ్డూరంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment