అగర్తలా: త్రిపుర తదుపరి ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ–ఐపీఎఫ్‌టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమి ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశమై తమ ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ హాజరవనున్నారు. విప్లవ్ మాట్లాడుతూ ‘నేను ఇంకా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నిక కాలేదు. మాణిక్‌ను కలసి ఆశీర్వాదం తీసుకున్నాను’ అని చెప్పారు. త్రిపురలో పుట్టి పెరిగిన విప్లవ్ తన గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ వెళ్లి 16 ఏళ్లు ఆరెస్సెస్‌లో పనిచేశారు. అనంతరం 2015లో త్రిపురకు తిరిగొచ్చి బీజేపీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2016లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. గతేడాది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. విప్లవ్ సీఎంగా ఈనెల 8న ప్రమాణం చేసే అవకాశముంది.
మాణిక్ సర్కార్ రాజీనామా
శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడంతో త్రిపుర ప్రస్తుత సీఎం మాణిక్ సర్కార్ తన పదవికి రాజీనామా చేశారు. మాణిక్ ఆదివారం గవర్నర్ తథాగత రాయ్‌ని కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు. 1998 నుంచీ త్రిపుర సీఎంగా ఉన్న మాణిక్ సర్కార్.. బీజేపీ కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకునే వరకు పదవిలో కొనసాగుతారు. త్రిపురలో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ–ఐపీఎఫ్‌టీ కూటమి 43, సీపీఎం 16 సీట్లు గెలుపొందడం తెలిసిందే. కాగా, మంత్రివర్గంలో తమ పార్టీకి గౌరవనీయమైన ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీని ఐపీఎఫ్‌టీ కోరింది. బీజేపీ 35 స్థానాల్లో గెలవడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉంది. అటు ఐపీఎఫ్‌టీ 9 స్థానాల్లో పోటీచేసి 8 చోట్ల గెలిచింది.
కాంగ్రెస్‌తో పొత్తుపై పునరాలోచన..
జనవరిలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం జరిగినప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, భవిష్యత్తులో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులూ ఉండకూదంటూ పార్టీ శ్రేణులు అప్పట్లో ఓ ముసాయిదా తీర్మానం కూడా చేశాయి. వచ్చే నెలలో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. ఇప్పుడు త్రిపురలో ఓటమి నేపథ్యంలో ఆ తీర్మానాన్ని వెనక్కు తీసుకునే అవకాశముంది. ‘కాంగ్రెస్‌తో పొత్తులు, సర్దుబాట్లు ఉండకూడదని గతంలో నిర్ణయించాం. కానీ ఇప్పుడు పునరాలోచించాల్సిన అవసరం ఉంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు హన్నన్ మొల్లా చెప్పారు.
త్రిపుర కొత్త సీఎం విప్లవ్!
Published Mon, Mar 5 2018 1:54 AM | Last Updated on Mon, Mar 5 2018 1:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment