ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం కూర్పు గమనిస్తే తెలుగుదేశం పార్టీలో తరం మారుతోందన్న స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లు అనిపిస్తుంది. బహుశా ఈ టరమ్ లోనే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉండవచ్చనిపిస్తుంది. దానికి తగ్గట్లుగా కొత్త టీమ్ ను తయారు చేసే ప్రక్రియ ఆరంభించినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే తొలివిడత ఎన్నికైన ఎమ్మెల్యేలు పలువురికి మంత్రి పదవులు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. తద్వారా లోకేష్ కు సొంత టీమ్ తయారు అవుతుందని అంటున్నారు.
ముఖ్యంగా 1995లో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో అత్యంత కీలకభూమిక పోషించిన యనమల రామకృష్ణుడుకు ప్రస్తుత మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. యనమల ఎమ్మెల్సీగా ,మండలిలో ఇంతకాలం ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రకంగా కూడా ఒక తరం మారినట్లు లెక్క. యనమల 1999,2014 టరమ్ ల లో ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. 1983 లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కీలకంగా ఉన్నారు. అలాగే 1983 లో శాసనసభకు ఎన్నికైన బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్యేలు అయిన గద్దె రామ్మోహన్, ధూళిపాళ్ల నరేంద్ర,జ్యోతుల నెహ్రూ వంటివారికి కూడా అవకాశం దక్కలేదు. ఎంత సీనియర్లు యినా అందరికి అవకాశాలు రావడం కష్టమే.కాని ఓవరాల్ గా చూసినప్పుడు మంత్రివర్గ స్వరూపాన్ని బట్టి ఈ విశ్లేషణలు వస్తాయి. అప్పట్లో యువకులే అయినా, ప్రస్తుతం వీరంతా వృద్దాప్యానికి చేరువ అవడాన్ని కూడా కొట్టిపారేయలేం.
1985లో తొలిసారి ఎన్నికై టీడీపీలోనే కొనసాగుతున్న ఎన్ ఎమ్ డి ఫరూక్ కు ఈ సారి కూడా మంత్రి పదవి వచ్చింది. విశేషంగా 1983లో టిడిపిలో ఉండి,1989 నుంచి కాంగ్రెస్ లో,తిరిగి 2014 టరమ్ లో టీడీపీలో, 2019లో వైఎస్సార్‌సీపీలో ఉండి, 2024 ఎన్నికల నాటికి టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డికి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కడం ఆసక్తికరంగా ఉంది.
ఇదీ చదవండి: ఏపీలో ఏ శాఖ ఎవరికి?.. కొనసాగుతున్న లీక్స్
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు ,కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీ లో చేరి ఈసారి ఢోన్ లో గెలిచారు. అయినా ఆయనకు మంత్రి చాన్స్ రాలేదు. మరో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కు, చంద్రబాబుకు మధ్య ఉప్పు,నిప్పుగా ఉంటుంది. కాని భాస్కరరావు కుమారుడు మనోహర్ జనసేన తరపున గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి కావడం ఇంకో ప్రత్యేకత. ఇతర కోణాలను పరిశీలిస్తే, గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్ కూర్పునకు ఈ క్యాబినెట్ కు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
అప్పట్లో జగన్ బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగా, చంద్రబాబు ఆ స్థాయిలో ప్రాముఖ్యత ఇవ్వలేకపోయారు. జగన్ ఐదుగురికి,అందులో నలుగురు బలహీనవర్గాలవారికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించగా,చంద్రబాబు క్యాబినెట్ లో ఆ అవకాశం ఉండదు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి లభించనుంది. ఆయనకు కాకుండా ఇతరులకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ప్రాధాన్యత తగ్గించినట్లవుతుందని భావించి ఇలా చేశారట. జగన్ అధికారంలోకి రాగానే ఏభైశాతం మందికి బలహీనవర్గాలవారికి మంత్రి పదవులు ఇచ్చి, తదుపరి పునర్వ్యవస్థీకరణలో దానిని అరవై ఎనిమిది శాతానికి పెంచారు. ఆయన క్యాబినెట్ లో ఎస్సి,ఎస్టి, బిసి,మైనార్టీ వర్గాల వారు పదిహేడు మంది ఉండేవారు. ప్రస్తుతం చంద్రబాబు టీమ్ లో ఆ సంఖ్య పన్నెండుగానే ఉంది. జగన్ ఐదుగురు ఎస్సిలకు పదవులు ఇవ్వగా,ఇప్పుడు ఇద్దరికే అవకాశం వచ్చింది.
జగన్ బిసిలు పదకుండు మందికి చాన్స్ ఇస్తే, చంద్రబాబు ఎనిమిది మందికే ఇచ్చారు.అప్పట్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఒకరు కొంతకాలం మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం నలుగురు కమ్మ నేతలకు మంత్రిపదవులు దక్కాయి. కాపులకు సంబంధించి అప్పటి మాదిరే నలుగురికి అవకాశం వచ్చింది. అప్పట్లో రెడ్లు నలుగురు ఉంటే,చంద్రబాబు వద్ద ముగ్గురు రెడ్లకే పదవులు దక్కాయి. స్థూలంగా చూస్తే అగ్రవర్ణాలకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు.జనసేన నుంచి ముగ్గురికి అవకాశం వస్తే ఇద్దరు కాపు,ఒక కమ్మ నేతకు పదవులు వచ్చాయి. బీజేపీ ఒక బిసి కి మంత్రి పదవి ఇచ్చింది. 2014 టరమ్ లో నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. కాని ఈ టరమ్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ప్రస్తుతానికి ఒకరికే అవకాశం ఇచ్చారు. కేంద్రంలో తాను ఆశించినన్ని పదవులు మోడీ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఏమైనా ఇలా చేశారా?లేక మరో స్థానం ఖాళీగా ఉంది కనుక ,బీజేపీకి రిజర్వు చేసి ఉంచారా అన్నది చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు పదమూడు మంది అగ్రవర్ణాల వారికి పదవులు ఇచ్చారు. తొలిసారి మంత్రి పదవులు పొందినవారి సంఖ్య పదహారుగా ఉండడం విశేషం. వీరిలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడుగురికి పదవులు రావడం విశేషం.
కాగా గతంలో ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవులు నిర్వహించిన ఇద్దరు లోకేష్, పి.నారాయణలు ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులు పొందారు.వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లిన ఇద్దరు ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారధిలకు చంద్రబాబు క్యాబినెట్ లో అవకాశం రావడం విశేషం. కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర,పి.నారాయణ,ఫరూఖ్ , రామనారాయణరెడ్డి, పార్ధసారధి,లోకేష్ లకు మంత్రి పదవులు చేసిన అనుభవం ఉంది.నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లో డిప్యూటి స్పీకర్, స్పీకర్ పదవులు చేశారు.
పవన్ కళ్యాణ్ తో సహా వంగలపూడి అనిత,సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా వీరాంజనేయ స్వామి,గొట్టిపాటి రవి,కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బిసి జనార్ధనరెడ్డి, టిజి భరత్, ఎస్.సవిత,వాసంశెట్టి సుభాష్,కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లె రాంప్రసాదరెడ్డి లు తొలిసారి మంత్రులు అయ్యారు. వీరిలో పయ్యావుల కేశవ్ తొలిసారి 1994 లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఇంతకాలం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన ఓటమిపాలవడం, లేదా ఈయన గెలిచినప్పుడు టీడీపీ అధికారంలోకి రాకపోవడం జరుగుతుండేది. ఈసారి ఆ ఇబ్బంది రాలేదు.
గొట్టిపాటి రవి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తదుపరి 2014లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉండేవారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు టీడీపీలోకి వెళ్లి 2019లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. ఈసారి మంత్రి పదవి పొందగలిగారు. సత్యకుమార్ యాదవ్ పూర్వం బీజేపీ అగ్రనేతలలో ఒకరైన ఎమ్..వెంకయ్య నాయుడు వద్ద పిఎ గా జీవితాన్ని ఆరంభించి, ఆ తర్వాత నేరుగా అమిత్ షా అండతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అయ్యారు. ఈ విడత బీజేపీ టిక్కెట్ పొంది, గెలిచి మంత్రి కాగలిగారు.
రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత ఓటమి ఎరుగని గంటా శ్రీనివాసరావుకు కూడా మంత్రి పదవి రాలేదు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరో నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి హామీ ఉందని చెబుతారు. కాని ఆయనకు ఇవ్వకుండా ఆనం వైపు మొగ్గు చూపారు.బీజేపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరో సీనియర్ నేత ఆరుసార్లు ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణకు కూడా చాన్స్ రాలేదు. సహజంగానే మంత్రి పదవులు దక్కని సీనియర్లకు కొంత అసంతృప్తి ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు బహిర్గతం కాకపోయినా, భవిష్యత్తులో వెల్లడి కావచ్చు. మంత్రి పదవులు ఇవ్వడం అన్నది ఒక సవాలు.అందరిని సంతృప్తిపరచడం ఏ సీఎం వల్ల కాదు. బలహీనవర్గాలవారికి ఆశించిన రీతిలో పదవులు రాలేదన్న భావన ప్రచారం కాకుండా జాగ్రత్త పడడంలో చంద్రబాబు నేర్పరే అయినప్పటికీ, జగన్ క్యాబినెట్‌తో ఈ విషయంలో అంతా పోల్చుకుంటారని చెప్పకతప్పదు.
లోకేష్ సహజంగానే మంత్రివర్గంలో తన ముద్ర ఉండాలని కోరుకుంటారు.అందుకు తగ్గట్లుగానే చంద్రబాబు మంత్రుల ఎంపిక చేసి ఉండవచ్చు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న పలువురు కీలక నేతలకు మంత్రులుగా అవకాశం రాకపోవడం తరం మార్పునకు ఒక సూచనగా పరిగణిస్తున్నారు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment