దుంగార్పూర్(రాజస్తాన్): ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకు తాను వచ్చే ఐదేళ్లలో న్యాయం చేయడం ద్వారా ఆ ధోరణికి స్వస్తి పలకాలనుకుంటున్నానని చెప్పారు. మంగళవారమిక్కడి గిరిజన ఆధిపత్య ప్రాంతమైన బనేశ్వర్ ధామ్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఒక వేళ తమ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, వచ్చే ఏడాదిలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘ఐదేళ్లలో పేదలు, గిరిజనులు, బలహీన వర్గాల వారికి అన్యాయం చేశారు. కానీ కాంగ్రెస్ వారికి న్యాయం చేయాలనుకుంటోంది.
మీరు ఐదేళ్లలో వారి నుంచి లాక్కున్న దాని కంటే ఎక్కువ మొత్తం మేం వారికి ఇస్తాం’అని చెప్పారు. ప్రధాని ఆయనకు ఏది తోస్తే అది మాట్లాడేస్తారని, తాము మాత్రం కనీస ఆదాయ పథకం న్యాయ్, ఉద్యోగిత, రైతుల సంక్షోభంపై నిజాలే చెప్తామని వ్యాఖ్యానించారు. లక్షలాదిమంది యువకులు ‘న్యాయ్’కావాలంటూ ఓటు వేసేందుకు వస్తున్నారని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా యువత ఓటు వినియోగించుకుంటున్నారు. అందులో చాలావరకు తొలి ఓటర్లున్నారు. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. ప్రతి భారతీయుడికీ న్యాయ్ కావాలి. అందరూ తెలివిగా ఆలోచించే ఓటు వేస్తారనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment