మోదీపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులు 'ఫేక్' అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర పరుషమైన వ్యాఖ్యలు చేశారు. భారత జవాన్ల త్యాగాలతో మోదీ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ విరుచుకుపడ్డారు.
'మన జవాన్లు వారి రక్తాన్ని ఇచ్చారు. దేశం కోసం సర్జికల్ దాడులు చేశారు. కానీ మీరు (మోదీ) వారి (జవాన్ల) నెత్తురు వెనుక దాక్కుంటున్నారు. వారితో దళాలీ (వ్యాపారం) పనిచేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు' అని ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ఆగ్రహంగా పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది.
ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. సైన్యం సత్తాను ప్రశ్నించేలా రాజకీయ వ్యాఖ్యలు వెలువడటంతో సర్జికల్ దాడుల వీడియో దృశ్యాలను సైన్యం కేంద్ర ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే.