బుందీలో జరిగిన ర్యాలీలో రాజస్తాన్ సంప్రదాయ తలపాగాలో రాహుల్ అభివాదం
జైపూర్/పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం(న్యాయ్) అనేది పేదరికంపై సర్జికల్ దాడి చేయడమేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పథకం రూపకల్పన కోసం ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను సంప్రదించామని వెల్లడించారు. 21వ శతాబ్దంలో ప్రజలెవరూ పేదలుగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. రాజస్తాన్‌లోని సూరత్‌గఢ్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.
14 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టారు..
న్యుంతమ్ ఆయ్ యోజన(న్యాయ్) పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ‘ఇది బిగ్ బ్యాంగ్. బాంబు పేలేందుకు సిద్ధంగా ఉంది. ఇది పేదరికంపై కాంగ్రెస్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్. యూపీఏ ప్రభుత్వం గతంలో 14 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయగా, బీజేపీ వారందర్ని మళ్లీ పేదరికంలోకి నెట్టింది’ అని వెల్లడించారు. దేశప్రజలకు చౌకీదార్(కాపలాదారు)గా ఉంటానన్న మోదీ.. అనిల్ అంబానీ వంటివారికి చౌకీదార్‌గా మారారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేశంలోని చిన్న, మధ్యతరగతి వ్యాపారులు వ్యాపారం చేయడం మానేసి జీఎస్టీ దరఖాస్తులు నింపుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. న్యాయ్ పథకాన్ని మాస్టర్ స్ట్రోక్‌గా బీజేపీ రెబెల్ నేత శతృఘ్న సిన్హా అభివర్ణించారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని సిన్హా గుర్తుచేశారు. మరోవైపు న్యాయ్ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఢిల్లీ కాంగ్రెస్ విభాగం ఆయ్ పే చర్చా(ఆదాయంపై చర్చ) అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment