సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్ ఆరేళ్ల పాలనపై బీజేపీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. ఆరేళ్లలో టీఆర్‌ఎస్ పాలనలో పురపాలికలు నిధులు లేక పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆరోపించింది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ టీఆర్‌ఎస్‌కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తూ బీజేపీ ముందుకు వెళ్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా మోసపోకుండా ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నామన్నారు.
పట్టణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో టీఆర్‌ఎస్ వైఫల్యాలపై 52 అంశాలతో రూపొందించిన చార్జ్‌షీట్‌ను బీజేపీ రాష్ట్ర కార్యాయంలో గురువారం లక్ష్మణ్ విడుదల చేశారు. అలాగే పార్టీ పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం టీఆర్‌ఎస్ అండతోనే ఇప్పుడు భైంసా వరకు వెళ్లిందని, ఎంఐఎం అజెండాను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయవద్దన్నారు. ఎంఐఎంతో లాలూచీ లేకపోతే భైంసాలో టీఆర్‌ఎస్ అభ్యర్థు«లను ఎందుకు పోటీ లో ఉంచలేదని, ఒవైసీకి కేసీఆర్ లొంగిపోయారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సమస్య లేదని, కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలన్నారు. పట్టణాలను డల్లాస్‌లా తయారు చేస్తామని, హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులే పట్టణాలను ఆదుకుంటున్నది వాస్తవమా.. కాదా.. అన్నది కేటీఆర్ చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment