
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యల రాజీనామాలతో ఘోరక్‌పూర్, ఫుల్‌పూర్ పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న ఈ రెండు స్థానాలను మళ్లీ తమ ఖాతాలోనే వేసుకోవడంతోపాటు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఇక్కడి నుంచి విజయం సాధించి అధికార పార్టీకి గండికొట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాల్లో ఉన్నాయి. 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం కానున్నాయి. ఘోరక్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం రెండు దశాబ్దాలకుపైగా బీజేపీ ఖాతాలోనే ఉండగా, ఫుల్‌పూర్ నియోజకవర్గంలో మౌర్య గెలవడమే తొలిసారి.
ప్రజలు తమ వెంటే ఉన్నారని తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తెలియజేశాయని, కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న పథకాలు వారికి సంతృప్తినిచ్చాయని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలు సమాజ్ వాదీ విజయం సాధించి తీరుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ రెండు రోజుల క్రితం జరిగిన ఓ సభలో జోస్యం చెప్పారు. ఈ విజయం 2019 ఎన్నికలకే కాదు.. 2022 అసెంబ్లీ ఎన్నికల తీర్పును ప్రతిబింభిస్తుందన్నారు. ఫుల్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, విజయలక్ష్మీ పండిట్ లాంటి మహామహులు పోటీ చేసి విజయం సాధించారు. 2014లో మౌర్య 5,03,564 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, యోగి.. 5,39,127 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.