
‘దళితులను బానిసలుగా పరిగణిస్తున్నా... ఏంకాదులే.’
సాక్షి, బెంగళూరు : తమ పార్టీ కార్యకర్త(జనతాదళ్(ఎస్)) హత్యకు గురికావడంపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక సీఎం కుమారస్వామి... హంతకులను కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుమారస్వామిపై తీవ్ర స్థాయిల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన ఆయన.. ‘ ఏదో బాధలో అలా అన్నానే తప్ప, ఓ ముఖ్యమంత్రిగా పోలీసు అధికారులకు ఆదేశాలివ్వలేదు. ప్రకాశ్ హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఇంతకుముందు మరో రెండు హత్య కేసుల్లో నిందితులుగా ఉండి, బెయిల్‌పై బయటకు వచ్చారు’ అంటూ వివరణ ఇచ్చారు.
కాగా కుమారస్వామి వివరణపై ప్రతిపక్ష బీజేపీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది. ‘రైతులు చచ్చిపోతే... భావోద్వేగాలు ఉండవు. ప్రభుత్వ అధికారులు హత్యకు గురైతే... అది పెద్ద విషయమే కాదు. అవినీతి జరిగినా మరేం పర్లేదు. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినా... నా దగ్గర అటువంటి వివరాలేమీ లేవు. దళితులను బానిసలుగా పరిగణిస్తున్నా... ఏంకాదులే. కానీ జేడీఎస్ కార్యకర్త హత్యగావించబడితే మాత్రం నిందితులను వెంటనే కాల్చి పారేయాలంటూ పోలీసులకు ఆదేశాలు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే.. కుమారస్వామికి జేడీఎస్‌తో తప్ప మిగిలిన వారు ఎలా ఉన్నా పట్టదు’ అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
అసలేం జరిగింది...
జేడీఎస్ పార్టీకి చెందిన జిల్లా నాయకుడు హొణ్నలగెరె ప్రకాశ్ సోమవారం సాయంత్రం కారులో ప్రయాణిస్తుండగా.. బైక్‌పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రకాశ్‌పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన ఆస్పత్రికిలో మృతి చెందారు.
Farmers died - No emotions
— BJP Karnataka (@BJP4Karnataka) December 25, 2018
Govt officials killed - Doesn’t matter
Massive Corruption - That’s ok
No development programs - I don’t print note
Dalits pushed to Slavery - hmmm
JDS Karyakartha murdered - Orders cops to immediately shoot
For Kumaraswamy all that matters is JDS