సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీ ముందస్తు ఎన్నికలకు అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు సీనియర్లందరినీ బరిలోకి దించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయను సనత్‌నగర్ శాసనసభకు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావును మల్కాజ్‌గిరి శాసనసభ స్థానం నుంచి పోటీకి నిలబెట్టనుంది. ఈ ఇద్దరి పదవీ కాలం ఇంకా ఉన్నా, గెలుపే లక్ష్యంతో పని చేయటం..ఇతర నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉండడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు.
వీరితో పాటు సిట్టింగ్ స్థానాల్లో అంబర్‌పేట – కిషన్‌రెడ్డి, గోషామహల్ – రాజాసింగ్, ముషీరాబాద్ – డాక్టర్ లక్ష్మణ్, ఖైరతాబాద్ – రామచంద్రారెడ్డి, ఉప్పల్ – ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లే మళ్లీ పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన చోట్ల కూడా సీనియర్లను, జనంతో సంబంధం ఉన్న నేతలనే రంగంలోకి దింపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్‌లో సతీష్‌గౌడ్, కార్వాన్‌లో దేవర కరుణాకర్, జూబ్లీహిల్స్ ఏపీకి చెందిన మాజీ మంత్రి కుమారుడి పేర్లను దాదాపు ఖరారు చేశారు. ఇదిలా ఉంటే నగరంతో పాటు శివారు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్‌లోనూ ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు వచ్చి బీజేపీలో చేరే అవకాశం ఉందని ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు.
అమిత్ షా సభతో సమరశంఖం
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసి, ఆ రోజు నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే దిశగా బీజేపీ నేతలు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే వివిధ పార్టీల చోటా నేతలను పార్టీలో చేర్చుకుంటూ, అమిత్ షా సమక్షంలో ముఖ్యమైన నేతల చేరికలకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం లోక్‌సభ నియోజకవర్గాల వారిగా ఇన్‌చార్జులు అసెంబ్లీ స్థానాల వారిగా రోజు వారి సమీక్షలు, సభలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment