ఈసారైనా దళితుడిని సీఎం చేస్తారా? | BJP leader Amit Shah Straight question to KCR | Sakshi
Sakshi News home page

ఈసారైనా దళితుడిని సీఎం చేస్తారా?

Published Sun, Sep 16 2018 1:50 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

BJP leader Amit Shah Straight question to KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని 2014లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీ ఇంకా నాకు గుర్తుంది. కేసీఆర్‌ మరిచిపోయి ఉండవచ్చు, కానీ రాష్ట్రంలోని దళితులు మరిచిపోలేదు. సరే తప్పైపోయింది.. ఆలస్యమైంది అనుకుందాం.. 2018లో అయినా దళితుడికి సీఎం పదవి ఇస్తారా?’’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  రాజకీయాల్లో కుటుంబపాలనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది విఘాతం కలిగిస్తుందన్నారు. కేవలం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడానికే రాష్ట్ర ప్రజలపై 9 నెలల ముందు ఎన్నికలు రుద్దబడ్డాయన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘బీజేపీ ఇచ్చిన వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ నినాదానికి చంద్రశేఖర్‌రావు మద్దతు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడిన ఆయన అకస్మాత్తుగా వైఖరి మార్చుకుని చిన్న రాష్ట్రంపై ఎన్నికల వ్యయ భారం మోపారు. రాజకీయ స్వార్థం కోసమే కేసీఆర్‌ ప్రజలపై రూ.కోట్ల ఖర్చును రుద్దారు’’అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలమైన అభ్యర్థులతో బీజేపీ ప్రతి స్థానంలో శాయశక్తులా గెలుపునకు కృషి చేస్తుందన్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో బలమైన, నిర్ణయాత్మక శక్తిగా ఏర్పడతామని ధీమా వ్యక్తం చేశారు. గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేశామని, పార్టీ సభ్యత్వాలను గణనీయంగా పెంచామన్నారు.  

బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి... 
టీఆర్‌ఎస్‌ పాలనను పరిశీలిస్తే మళ్లీ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదన్నారు. బీజేపీ ఎన్నికలను తేలిగ్గా తీసుకోనుందని తప్పుడు ప్రచారం జరుగుతోందని అమిత్‌షా కొట్టిపారేశారు. మహబూబ్‌నగర్‌ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని, ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, ఈ యుద్ధంలో ధైర్యంతో దూకుడుగా పోరాడనున్నారన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన దళితులపై పోలీసులు సాగించిన అరాచకాలను తెలంగాణ దళితులు ఇంకా మరవలేదన్నారు.

టీఆర్‌ఎస్‌తో ఎలాంటి ఎన్నికల పొత్తు పెట్టుకోవడం లేదని, ప్రజా సమస్యలపై రాష్ట్రంలో బీజేపీ పోరాడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌తో లోపాయకారి ఒప్పందం కూడా ఏమీ లేదని స్పష్టం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఉప చైర్మన్‌ ఎన్నిక తదితర అంశాల్లో కాంగ్రెస్‌ను వ్యతిరేకించాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌.. బీజేపీకి మద్దతిచ్చిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వ్యతిరేకించడం తమ విధానం కాదన్నారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లు ఒకరిపై ఒకరు పోటీచేయడం లోపాయికారీ ఒప్పందమని, ఒవైసీ చెప్పే ఒక్క మాటను కూడా కేసీఆర్‌ జవదాటరని విమర్శించారు.  

బాబు సానుభూతి రాజకీయాలు... 
బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనకు సంబంధించి పాత కేసులో మహారాష్ట్ర కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ను టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సానుభూతి రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అమిత్‌షా తప్పుబట్టారు. చంద్రబాబు బాబ్లీ వద్ద 2013లో ప్రదర్శన జరిపినప్పుడు ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర రెండు చోట్లా కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నాయని, అప్పుడే చంద్రబాబుపై కేసు పెట్టారన్నారు. తనపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్‌తో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసుకోవడానికి బయలుదేరారని అమిత్‌షా విమర్శించారు. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. 25 సమన్లు జారీ చేసినా చంద్రబాబు స్పందించకపోవడంతో కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసిందన్నారు. తమ పార్టీ నేతలపై కూడా సమన్లు వచ్చాయని, వారు కోర్టుకు హాజరై కేసులను పరిష్కరించుకున్నారన్నారు.  

టీఆర్‌ఎస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు .. 
‘‘తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడిన వారే సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదు?. కేవలం ఎంఐఎం ఒత్తిడి, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఒవైసీ మాటలు వినే ఈ ఉత్సవాన్ని బంద్‌ చేశారు. తెలంగాణను నేటి రజాకార్ల చేతిలో పెట్టాలా? అన్న అంశంపై రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగ విరుద్ధంగా మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ కేంద్రానికి తీర్మానం పంపించడం వారిని బుజ్జగించే రాజకీయాలే. మతపర రిజర్వేషన్లకు రాజ్యాంగం అనుమతించదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం ఒప్పుకోదని కూడా కేసీఆర్‌కు తెలుసు. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రభుత్వం గెలిస్తే మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలు కొనసాగుతాయి’’అని అమిత్‌షా మండిపడ్డారు. ‘‘ఇక్కడ కాంగ్రెస్, కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, మిగతా వారు కలిసి ఒక కూటమి ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎలా తెలుగు ప్రజల ఓట్లపై తన అధికారాన్ని చెలాయిస్తుందో అర్థం కావడం లేదు’అని పేర్కొన్నారు. 1983లో నాటి సీఎం అంజయ్యను, మరణానంతరం మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్‌ అవమానించిన తీరును తెలుగు ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. తమ ప్రభుత్వం ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించిందని, కాంగ్రెస్‌ పార్టీ 60 ఏళ్లలో చేయలేకపోయిందన్నారు. ఓబీసీ బిల్లు రాజ్యసభలో వచ్చినప్పుడు కాంగ్రెస్‌ అడ్డుకుందని, సభలో బీజేపీ బలం పెరిగిన తర్వాతే బిల్లు ఆమోదానికి నోచుకుందన్నారు. ఓబీసీ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌.. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించగలదా? హైదరాబాద్‌ విమోచన దినాన్ని నిర్వహించగలదా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, తెలంగాణకు న్యాయం చేయలేదన్నారు. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినా ఎక్కడా రక్తపాతం, వివాదాలు చోటు చేసుకోలేదని, ఇది బీజేపీ పనితీరుకు నిదర్శనమన్నారు.  

హామీలు అమలు కాలేదు... 
వాస్తు బాగాలేదని 4 ఏళ్లుగా కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లకపోవడం 21వ శతాబ్దపు తెలంగాణకు ఏ మాత్రం మంచిది కాదని అమిత్‌షా తప్పుబట్టారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అమర వీరులకు, వారి కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించలేదని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయినా ఏమైనా చేయగలుగుతారా? అని కేసీఆర్‌ని ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రొఫెసర్ల నియామకం సైతం జరుగలేదన్నారు. ప్రపంచ స్థాయి ఆస్పత్రులుగా ఉస్మానియా, గాంధీలను అభివృద్ధి చేస్తామన్న హామీ మళ్లీ కొత్త మేనిఫెస్టోలోనూ పెడతారా అని ఎద్దేవా చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి, మండల కేంద్రంలో 30 పడకల నిర్మాణం హామీ ఏమైందన్నారు. గత నాలుగేళ్లలో ఓ అంచనా ప్రకారం..  4,200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. పేదలకు రెండు లక్షల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనను అయినా సరిగ్గా అమలు చేస్తే కనీసం పేదలకు ఇళ్లు లభించేవన్నారు. నాలుగున్నరేళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించారని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల సమస్యలు ఇంకా పెరిగాయన్నారు. ఆ జిల్లాలకు కలెక్టర్, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఖమ్మంలో మద్దతు ధర అడిగిన రైతులకు సంకెళ్లు వేయించారని, గత పదేళ్లలో ఇలాంటి ఘటన ఎక్కడ వినలేదన్నారు. రైతులకు సాగు ఖర్చుతో పోల్చితే 1.5 శాతం మద్దతు ధర అధికంగా ఇవ్వాలని ఇటీవలే కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.  

సీఎం అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు
బీజేపీ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తారని ప్రశ్నించగా.. సీఎం అభ్యర్థిని పార్టీ ఇంకా నిర్ణయించలేదని అమిత్‌షా తెలిపారు. మోదీ రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహించనున్నారన్నారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు, పడిపోతున్న రూపాయి విలువ కేంద్రానికి ఆందోళన కలిగించే విషయమన్నారు. అమెరికా–చైనా, అమెరికా–చమురు ఉత్పత్తి దేశాల మధ్య తలెత్తిన అంతర్జాతీయ వివాదాలే వీటికి కారణమన్నారు. ఈ నాలుగేళ్లలో 220 మంది జర్నలిస్టులు అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో చనిపోయారని ఇండియన్‌ జర్న లిస్ట్‌ యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ అమిత్‌షాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభపక్ష నేత జి.కిషన్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర పథకాలను అడ్డుకుంది 
బీజేపీ పథకాలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డుకుందని అమిత్‌షా ఆరోపించారు. దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని తీసుకొచ్చి రూ.5 లక్షల వరకు అన్ని రకాల పెద్ద రోగాలకు వైద్య ఖర్చు భరించేందుకు మోదీ ప్రభుత్వం ముందుకొస్తే, ఈ పథకం కింద తెలంగాణ చేరలేదన్నారు. రాజకీయ కారణాలతో దీన్ని ప్రజలకు దూరం చేయడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రధాన మంత్రి ఫస్‌ బీమా యోజన కింద 15% రాష్ట్ర రైతులు మాత్రమే ప్రయోజనం పొందారన్నారు. పట్టణ, గ్రామీణ, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనలను ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అమలు చేయట్లేదన్నారు. మిషన్‌ ఇంద్ర ధనుష్‌ కింద గర్భవతి, నవజాత శిశువులకు టీకా వేయించడానికి ఇచ్చే నిధులను 38% మాత్రమే రాష్ట్రం వాడుకుందన్నారు.

వ్యవసాయ మార్కెట్లను కంప్యూటరీకరించే పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదన్నారు. కేంద్రం 4 ఏళ్ల కింద రాష్ట్రానికి మూడు ఫుడ్‌ పార్కుల ఏర్పాటుకు రూ.165 కోట్లు మంజూరు చేసినా వినియోగించుకోలేదన్నారు. 14వ ఆర్థిక సంఘం కింద కేంద్రం ఇచ్చిన నిధులు గ్రామాలకు వెళ్లలేదని, కలెక్టర్ల వద్ద మురుగుతున్నాయన్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రానికి 13వ ఆర్థిక సంఘం కింద రూ. 16,597 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయని, 14వ ఆర్థిక సంఘం కింద గత నాలుగేళ్లలో తాము రూ.1,15,605 కోట్లను ఇచ్చామన్నారు. రాష్ట్రానికి ఆదివాసీ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, కొండా లక్ష్మణ్‌ బాపూజీ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహా రావు వెటర్నరీ విశ్వవిద్యాలయం మంజూరు చేశామన్నారు.

పత్తి పరిశోధన కేంద్రం, స్పైస్‌ రీసెర్చ్‌ సెంటర్, సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ ఇన్‌ హైదరాబాద్‌కు, బయో డైవర్సిటీ రీసెర్చ్‌ సెంటర్‌కు, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్సలెన్స్‌కు సూత్రప్రాయ అంగీకారం తెలిపామన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులకు అద నంగా వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి మరో రూ.1.15 లక్షల కోట్ల సహాయం చేశామని, రాష్ట్రానికి మొత్తం రూ.2.3 లక్షల కోట్ల ప్రయోజనం కలిగిందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 15 వేల కోట్లతో పోల్చితే 20 రేట్లు ఎక్కువన్నారు. బీజేపీ సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు.  

హైదరాబాద్‌లో అమిత్‌షా ‘స్వచ్ఛతా హీ సేవా’
వాంబే కాలనీలో చీపురుతో ఊడ్చిన అమిత్‌ షా
నగరంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్గొన్నారు. శనివారం దోమలగూడలోని వాంబే కాలనీ సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కాలనీలో ఆయన చీపురు చేతబట్టి ఊడ్చారు. తర్వాత సమీపంలోని వినాయకుడి మండపానికి వెళ్లి గణనాథుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అమిత్‌ షా వెంట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఉన్నారు. అమిత్‌ షా రావడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement