
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీలో చేరికలకు ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీలో చేరికలు ఇంకా ఎక్కువగా ఉండనున్నాయని తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీమంత్రి సుద్దాల దేవయ్య బీజేపీలో చేరారు. లక్ష్మణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ త్వరలో ఖమ్మం నుంచి కూడా చేరికలు ఉంటాయన్నారు.
అభద్రతాభావం, అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు. పదేళ్లు కాదు.. 10 నెలలు కూడా భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఉనికి కోసమే కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తోందన్నారు. మజ్లిస్ చెప్పుచేతుల్లో ఉన్నందునే విమోచనదినాన్ని కేసీఆర్ అధికారికంగా నిర్వహించడంలేదని ఆరోపించారు. కాగా, గోదావరిలో బోటు ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారమివ్వాలని, కేంద్రం కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.