సాక్షి, రాజమండ్రి: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సాక్షిగా పెట్టమని కోరుతున్నామన్నారు. ధర్మపోరాట దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతున్నపుడు చంద్రబాబు నవ్వుతున్నారని ఆయన గుర్తుచేశారు. బాబు ప్రభుత్వం గాడి తప్పినట్టుందన్నారు. బాలకృష్ణ ఉపయోగించిన భాషను ఎవరు వాడుతారని ప్రశ్నించారు.
సీఎం వేదికపై ఉండగా బాలకృష్ణ మాట్లాడిన తీరును వర్ణించడానికి తన మనసు ఒప్పుకోవడం లేదని వీర్రాజు అన్నారు. 2019లో ఏం జరుగుతుందో చంద్రబాబుకు ఇపుడే కనపడుతోందని.. అందుకే ఆయన లయ తప్పి మాట్లాడుతున్నారన్నారు. ఏ రకంగా రూ. 30 కోట్లను దీక్ష కోసం చంద్రబాబు ఖర్చు చేస్తారని నిలదీశారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు టీడీపీకి అలవాటైపోయిందన్నారు. అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఈ ఏడాది కాలంలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
టీడీపీ చేసేది రూలింగ్ కాదని ట్రేడింగ్ అన్నారు. ప్రజాస్వామ్య వైఖరికి విరుద్ధంగా నిర్ణయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి దీక్షలు జరిగితే రాష్ట్ర ప్రజలు నష్టపోతారన్నారు. తమపై తెలుగుదేశానికి అక్కసు పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే ప్రత్యేక హోదా సందర్భంగా పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలన్నారు. అసెంబ్లీని అబద్దాల వాణిగా మార్చి, టక్కు టమార విద్యలు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడితే జైల్లో పెడతానన్న వ్యక్తి , ఇవాళ ధర్మపోరాటం చేస్తున్నానడం ఏం న్యాయమని అడిగారు. సీఎం డ్యాష్ బోర్డులో అన్నీ అబద్దాలేనన్నారు.
ప్రభుత్వ వైద్య పరికరాలను మెయింటెన్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారని, వారం రోజుల్లో చేయాల్సిన పరికరాలను మూడు, నాలుగు నెలలైనా బాగు చేయరని ఆరోపించారు. ఏపీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత బీజేపీ స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో వ్యాపార పరిపాలన కోసం మార్గాలు వేసుకుంటున్నామని టీడీపీ భావిస్తోందని, కానీ అది జరగనివ్వమని తెలిపారు. ఎవరైనా వాస్తవాలు మాట్లాడితే మీకున్నమాధ్యమాలతో హింసిస్తారు.. నాలుగేళ్లుగా టీడీపీతో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక్కసారిగా బయటపడ్డారు. దీంతో ఆయన తల్లిని కూడా తిట్టించేశారని వీర్రాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment