
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం తమకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. అయితే కాంగ్రెస్‌లోని చాలామంది సీనియర్ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఆదివారం నగరంలోని డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఆరోపించడం తగదన్నారు. ఆ రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం కొరవడిందని, ప్రభుత్వంపై వారికి నమ్మకం లేక తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు తాముసిద్ధమవుతున్నట్లు యడ్డి చెప్పారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక తదితర కసరత్తులు చేపట్టినట్లు చెప్పారు. అంతే కానీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో తాము సమావేశాలు నిర్వహించలేదని అన్నారు. తమ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించామన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు.
బీజేపీ ప్రలోభాలకు లొంగవద్దు: కుమారస్వామి
ఆపరేషన్ కమల్ పేరుతో అధికార పక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని సీఎం కుమారస్వామి ఆదివారం బెంగళూరులో ఆరోపించారు. అయితే అధికార పక్షంలోని ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లొంగవద్దని కోరారు. ఈ మేరకు ఆయన అధికార పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల గురించి పట్టించుకోవద్దని చెప్పారు. మంత్రి డీకే శివకుమార్‌పై ఈడీ, ఎఫ్‌ఐఆర్ తదితర కేసులు నమోదు చేస్తున్నారన్నారు. అయితే ఇదే సమావేశంలో నామినేటెడ్ పోస్టుల నియామకం, కేబినెట్ విస్తరణ తదితర విషయాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment