సంకీర్ణంలో సంక్షోభం | Will Welcome Decision If Congress and JDS Dissolves Assembly | Sakshi
Sakshi News home page

సంకీర్ణంలో సంక్షోభం

Published Wed, May 29 2019 3:59 AM | Last Updated on Wed, May 29 2019 3:59 AM

Will Welcome Decision If Congress and JDS Dissolves Assembly - Sakshi

బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి, సంక్షోభం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇరు పార్టీల్లోని పలువురు ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దడం కోసం కాంగ్రెస్‌ రాష్ట్ర ముఖ్య నాయకులతో చర్చలు జరిపేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్‌ బెంగళూరుకు రానున్నట్లు సమాచారం. మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కూడా వేణుగోపాల్‌తోపాటు బెంగళూరుకు రావాల్సి ఉన్నప్పటికీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆయన రావడం లేదని తెలిసింది.

కాంగ్రెస్‌ నేతలైన సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, కాంగ్రెస్‌ రాష్ట్రాధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు, మంత్రి డీకే శివకుమార్‌లతో వేణుగోపాల్‌ ప్రధానంగా భేటీ కానున్నారు. సీఎం కుమారస్వామి ఈ భేటీలో పాల్గొనే చాన్సుంది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కుమారస్వామి కూడా నేరుగా రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కర్ణాటక మంత్రివర్గంలో మార్పులు చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నాయకుడు ఎస్‌ఎం కృష్ణను ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రమేశ్‌ జర్కిహోళి, సుధాకర్‌లు కలిసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పెద్దలు ముందుజాగ్రత్త చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు.

ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ ఊగిసలాటే
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి కేవలం రెండే సీట్లలో గెలిచి ఘోర పరాభవం చెందడం తెలిసిందే. అనంతరం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ జూన్‌ 10 తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 సీట్లు ఉండగా, కాంగ్రెస్‌కు 79, జేడీఎస్‌కు 37, బీఎస్పీకి ఉన్న ఒక ఎమ్మెల్యేతో కలిపి మొత్తంగా 117 మంది ఎమ్మెల్యేలు అధికారపక్షంలో ఉండగా, బీజేపీకి సొంతంగా 105 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ ‘ఆపరేషన్‌ కమల’ను చేపడుతుందని పలుసార్లు వార్తలు వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వంపై అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు కూడా పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కాంగ్రెస్‌తో పొత్తు లేకపోయి ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచే వాళ్లమని జేడీఎస్‌ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఖాళీ స్థానాల భర్తీ మాత్రమే: సిద్దు
సంకీర్ణ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నారన్న వార్తలను మాజీ సీఎం సిద్దరామయ్య తోసిపుచ్చారు. మంత్రివర్గంలో మార్పులు ఏమీ ఉండబోవనీ, అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3స్థానాలను మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ‘ఇదొక రకం విస్తరణ. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి’ అని సిద్దరామయ్య మైసూరులో చెప్పారు. కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం కోసం ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి చేత రాజీనామా చేయిస్తారని వార్తలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ విషయం తనకు తెలీదన్నారు.మంత్రివర్గంలో 34 మంది ఉండాలి. వీరిలో 22 మంది కాంగ్రెస్‌ నుంచి, 12 మంది జేడీఎస్‌ నుంచి మంత్రులుగా ఉండేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

ప్రస్తుతం జేడీఎస్‌కు చెందిన రెండు, కాంగ్రెస్‌ నుంచి ఒక స్థానం మంత్రివర్గంలో ఖాళీగా ఉంది. మంత్రివర్గంలో చోటు సంపాదించేందుకు పలువురు నేతలు ఇప్పటికే కుమారస్వామితో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తాను మంత్రిని కావాలనుకుంటున్నానని కాంగ్రెస్‌ నేత మునియప్ప అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌ సభ్యుల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సీఎం కుమారస్వామి, కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేశ్‌ గుండూరావులతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. సుపపరిపాలనను, సమర్థ పాలనను అందించడమే తమ సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యమనీ, బీజేపీ బెదిరింపులతో తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదని సిద్దరామయ్య అన్నారు.

మా వాళ్లు ఒక్కరు కూడా బయటకు వెళ్లరు: యడ్యూరప్ప
కాంగ్రెస్‌–జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళితే బాగుంటుందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మంగళవారం అన్నారు. అలాగే బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌ లేదా జేడీఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరనీ, అయోమయాన్ని సృష్టించేందుకు ఆ పార్టీలు పుకార్లు పుట్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘రాష్ట్రంలోని 177 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా పార్టీ తొలి స్థానంలో ఉంది. మేం 28కి 25 లోక్‌సభ స్థానాలు గెలిచాం. వాళ్లు శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళితే బాగుంటుంది. వారు ఆ నిర్ణయం తీసుకుంటే మేం స్వాగతిస్తాం’ అని యడ్యూరప్ప అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement