
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని బీజేపీ నేత సుదీశ్ రాంబొట్ల విమర్శించారు. హైదరాబాద్‌లో సుదీశ్ రాంబొట్ల మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు దాడి చేసి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2009లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఈవీఎంలపై నెపం నెట్టారని, 2014లో గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయని బాబు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈవీఎంలను దొంగిలించిన కేసులో నిందితుడైన హరిప్రసాద్ మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈవీఎంలను మేనిపులేట్ చేసే అవకాశం ఉంటే తాము మొన్న జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోతామని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తోన్న వ్యవహారంపై గవర్నర్‌ని కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
బాబుపై దేశద్రోహి నేరం కింద కేసు
చంద్రబాబు నాయుడు వ్యవస్థలను తిట్టడం మొదలు పెట్టారని.. అందులో భాగంగానే మోదీని కూడా తిడుతున్నారని బీజేపీ నేత విజయ్ బాబు విమర్శించారు. చంద్రబాబుపై దేశ ద్రోహి నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ టెక్నీషియన్ హరిప్రసాద్‌ను తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని మాండ్యలో చంద్రబాబు ప్రసంగంపై చాలా అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment