ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్
సాక్షి, లక్నో: లోక్‌సభ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ కంచుకోట గోరఖ్‌పూర్ ఎస్పీ-బీఎస్పీ కూటమి బద్ధలు కొట్టింది. రెండు సిట్టింగ్ స్థానాల్లోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో బీజేపీ ఓటమి పాలైంది. భాజపా అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ పై 20వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
కాగా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామాతో ఖాళీ అయిన ఫుల్‌పూర్ నియోజకవర్గంలోనూ బీజేపీకి ప్రతికూల ఫలితం వచ్చింది. ఫూల్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ 59, 613 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య రాజీనామాలతో ఖాళీ అయిన లోక్‌సభ రెండు స్థానాల్లో బీజేపీ ఓడినట్లయింది. కాగా, ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.
మరోవైపు గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 1991 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటమి చెందలేదు. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, పూల్‌పూర్ నుంచి గెలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎంగా ఎన్నికవ్వడంతో ఈ నెల 4వ తేదీన ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచి 1998, 1999, 2004, 2009, 2014 వరుస ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కానీ తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఇక్కడ తొలిసారి ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment