సాక్షి, లక్నో: బీజేపీ ఈ ఫలితాలు ఊహించలేదని యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటమిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఓటమి అనంతరం యోగి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. ఎన్నికలు ప్రకటించిన సమయంలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ వేరువేరుగా ఉన్నాయి. కానీ అనూహ‍్యంగా ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపాయి. ఎస్పీ-బీఎస్పీపొత్తును చాలా తక్కువగా అంచనా వేశాం. ఈ ఫలితాలపై ఆత్మ విమర్శ చేసుకుని ముందుకెళ్తాం. ఈ ఓటమిని గుణపాఠంగా తీసుకుంటామని యోగి వివరించారు. బీజేపీపై తమ ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పార్టీల కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు.
సీఎం, డిప్యూటీ సీఎంలు రాజీనామా చేసిన గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ స్థానాల్లోనే బీజేపీ నెగ్గలేదంటేనే ఆ పార్టీ పాలన ఏవిధంగా ఉందో అర్థమవుతుందని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీని గెలిపించినందుకు గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యువకులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు మాకు అండగా నిలవడంతోనే మా విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఎన్నికల హామీల అమలులో బీజేపీ విఫలమైందని విమర్శించారు. తమకు ఈ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపిన ఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి అఖిలేశ్ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment