కులగూరగంప | BJP, Mahagathbandhan set to lock horns in Uttarbandhan | Sakshi
Sakshi News home page

కులగూరగంప

Published Tue, Apr 16 2019 6:23 AM | Last Updated on Tue, Apr 16 2019 6:23 AM

BJP, Mahagathbandhan set to lock horns in Uttarbandhan - Sakshi

కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన 282 స్థానాల్లో నాలుగో వంతు సీట్లు (71) అందించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. 2014 ఎన్నికలకు ఏడు నెలల ముందు పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకున్న  మత ఘర్షణలు బీజేపీకి లబ్ధి చేకూర్చాయి. ముస్లింలపై ద్వేషంతో చెప్పుకోదగ్గ సంఖ్యలో హిందువులు కులాలకు అతీతంగా కాషాయ పక్షానికి ఓటేశారు. దీనికి తోడు రాష్ట్రంలో బలమైన పునాదులున్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌–ఆరెల్డీ కూటమి విడివిడిగా పోటీ చేశాయి.

ఇప్పుడు రెండు మతాల మధ్య అలాంటి ఉద్రిక్తతలు లేవు. మతపరమైన చీలికలు తేవడానికి పాలకపక్షం యత్నిస్తున్నా జనం బాహాటంగా స్పందించడం లేదు. బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీ కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేస్తున్నాయి. దళితులు, యాదవులు, ముస్లిం వర్గాల మద్దతు ఉన్న ఈ కూటమి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. మరోపక్క కిందటి పార్లమెంటు ఎన్నికల్లో 7.5 శాతం ఓట్లతో రెండు సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్‌కు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెల్లెలు ప్రియాంక రంగ ప్రవేశం కొత్త ఉత్సాహం ఇస్తోంది.


పశ్చిమ యూపీలోని 8 సీట్లకు మొన్న జరిగిన తొలి దశ పోలింగ్‌పై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 18న జరగబోయే యూపీలోని మరో ఎనిమిది స్థానాలు కూడా పశ్చిమ యూపీలోనివే. ఈ స్థానాల్లో కూడా మహాగఠ్‌ బంధన్‌ విజయం సాధిస్తుందనీ, మొదటి దశలో బీజేపీపై కూటమి ఆధిక్యం సాధించిందని ఆయన ప్రకటించారు. ఇందులో నిజానిజాలెలా ఉన్నా మూడు పార్టీల కూటమి ఈసారి బీజేపీకి గట్టి పోటీయే ఇస్తుందని రాజకీయ పరిశీలకులు నమ్ముతున్నారు. 2014లో ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ, ఎస్పీ వరుసగా 22.2, 19.6 శాతం ఓట్లు సాధించాయి. ఎస్పీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు దక్కగా బీఎస్పీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. అప్నాదళ్‌తో కలిసి పోటీచేసిన బీజేపీ 42.3 శాతం ఓట్లతో మొత్తం 80 సీట్లలో 71 స్థానాలు కైవసం చేసుకుంది.

కాంగ్రెస్‌ ఫోకస్‌ 2022?
ప్రియాంకను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి (తూర్పు యూపీ ఇన్‌చార్జ్‌)గా నియమించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి మళ్లీ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసమే తాము కృషి చేస్తున్నామని రాహుల్, ప్రియాంక అనేక సందర్భాల్లో ప్రకటించారు. అంటే ఈ ఎన్నికల్లో తమతో పొత్తుకు ఎస్పీ–బీఎస్పీ కూటమి నిరాకరించడంతో తన ఉనికిని కాపాడుకునే పనిలో కాంగ్రెస్‌ నిమగ్నమైందని భావించాలి. అయితే, కాంగ్రెస్‌ ఎన్ని నియోజకవర్గాల్లో, ఎంత మేరకు ఓట్లు సాధిస్తుందనే అంశమే బీజేపీ నిలబెట్టుకునే సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుంది. బ్రాహ్మణులు, వైశ్యులు, రాజపుత్రులు, కాయస్త వంటి అగ్రకులాల ఓట్లను స్వల్ప సంఖ్యలో కాంగ్రెస్‌ చీల్చుకునే అవకాశాలున్నాయి. ఈ వర్గాలకు చెందిన బలమైన అభ్యర్థులను నిలిపిన చోట్ల అగ్రవర్ణాల ఓట్లు బీజేపీకి పూర్తిగా పడవని భావిస్తున్నారు. అలాగే, పశ్చిమ యూపీలో కూడా కాంగ్రెస్‌ తరఫున నిలబడే జనాదరణ ఉన్న ముస్లిం నేతలు కూడా మైనారిటీల ఓట్లను గణనీయ సంఖ్యలో సాధిస్తారని అంచనా. ప్రియాంక ఇన్‌చార్జ్‌గా ఉన్న తూర్పు యూపీలోని అత్యధిక సీట్లకు చివరి మూడు దశల్లో (మే 6, 13, 19) పోలింగ్‌ జరుగుతుంది. ఈ సీట్ల ఫలితాలు ప్రియాంక ప్రచారం ప్రభావం ఎంతో తేల్చేస్తాయి.

రెండో దశ పోలింగ్‌కు రెడీ
పశ్చిమ యూపీలోని ఎనిమిది సీట్లలో ఈ నెల 18న పోలింగ్‌ జరగనుంది. వాటిలో నగీనా, బులంద్‌శహర్, హాథ్రస్, ఆగ్రా ఎస్సీ రిజర్వుడు సీట్లు. అమ్రోహా, అలీగఢ్, మథుర, ఫతేపూర్‌ సిక్రీ జనరల్‌ స్థానాలు. ఈ నియోజకవర్గాల్లో హిందువుల జనాభా 75 నుంచి 88 శాతం వరకు ఉంది. ముస్లింలు 12 నుంచి 25 శాతం వరకు ఉన్నారు. ఇక్కడ బీసీ, ఎస్సీ కులాల జనాభా ఎక్కువ. మొత్తం మీద 80 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తోంది. బీసీల్లో విశ్వకర్మ, కుమ్మరి వంటి బాగా వెనుకబడిన కులాల (ఎంబీసీ) మొగ్గు ఈ స్థానాల్లో బీజేపీ వైపే ఉంది. దళితుల్లో చర్మకారులైన జాటవుల జనాభా ఎక్కువ. వారితోపాటు ఎస్సీల జాబితాలో ఉన్న ధోబీ, భంగీ, కోరీలు, కంజర్లు బీఎస్పీకి గట్టి మద్దతుదారులు.

 అంచనాకు అందదు..
2014లో ఎస్పీ, బీఎస్పీకి పడిన ఓట్లను కలిపితే 41 లోక్‌సభ స్థానాల్లో బీజేపీపై ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలకూ ఆరెల్డీ ఓట్లు తోడైతే మరికొన్ని స్థానాల్లో మహాగఠ్‌ బంధన్‌ విజయం సాధించాలి. పైన చెప్పినట్టు గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీలకు పోలైన ఓట్లను బట్టి కచ్చితంగా ఎవరు ఎన్ని సీట్లు గెలిచేదీ చెప్పడం సాహసమే అవుతుంది. ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమితో పాటు కాంగ్రెస్‌ కూడా యూపీ జనాభాలో 19 శాతం ఉన్న ముస్లింల ఓట్ల కోసం పోటీ పడుతున్నాయి. ముస్లింల మొగ్గు మహాగఠ్‌ బంధన్‌ వైపే ఉన్నా కాంగ్రెస్‌ అభ్యర్థులు బీజేపీని ఓడించేంత బలంగా ఉన్న స్థానాల్లో హస్తం గుర్తుకే వారు ఓటేస్తారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ ప్రధాని కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌ నాయకత్వంలోని ఆరెల్డీ బలం జాట్లతోపాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న పశ్చిమ యూపీకే పరిమితం. ఈ పార్టీతో పొత్తు ఎస్పీ, బీఎస్పీకి లాభిస్తుంది. ముజఫర్‌నగర్‌ ఘర్షణల నాటి విద్వేషాలు జాట్లు, ముస్లింల మధ్య లేకపోవడం కూడా మహాగఠ్‌ బంధన్‌ ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అయితే, పుల్వామా ఉగ్ర దాడి తర్వాత పాక్‌లోని బాలాకోట్‌పై భారత వాయుసేన మెరుపు దాడుల ఫలితంగా హిందువుల ఓట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో బీజేపీకి పడతాయని అంచనా.

జాట్లు, గుజ్జర్లదే ఆధిపత్యం
రెండో దశ పోలింగ్‌ జరిగే ఈ ప్రాంతంలో వ్యావసాయిక కులాలైన జాట్లు, గుజ్జర్లదే ఆధిపత్యం. ఈ రెండు కులాల ఓట్లు బీజేపీ, మహాగఠ్‌ బంధన్‌ మధ్య చీలిపోతాయని భావిస్తున్నారు. జాట్లు, మాయావతి కులమైన జాటవుల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల బీఎస్పీ ఓట్లను ఎస్పీ, ఆరెల్డీ అభ్యర్థులకు బదిలీ అయ్యేలా చూడటం మాయావతికి కష్టమైన పనిగా కనిపిస్తోంది. ఎస్సీలకు రిజర్వ్‌ చేసిన స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు వివిధ ఎంబీసీ, దళిత కులాల ఓట్లు ఎక్కువ పడతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ యూపీలోని ఈ ప్రాంతం లో ఇప్పటికే ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షడు రాహుల్‌గాంధీ, బీఎస్పీ నాయకురాలు మాయావతి భారీ బహిరంగసభల్లో పాల్గొని ప్రచారం చేశారు.

► మథురలో బీజేపీ తరఫున సినీ నటి, ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ హేమమాలిని పోటీచేస్తుండగా, ఆరెల్డీ అభ్యర్థి నరేంద్రసింగ్‌ రంగంలో ఉన్నారు.
► ఫతేపూర్‌ సిక్రీలో యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ నటుడు రాజ్‌ బబ్బర్‌ బీజేపీ అభ్యర్థి రాజ్‌ కుమార్‌ చాహర్‌తో తలపడుతున్నారు. ఇక్కడ బీఎస్పీ తరఫున రాజ్వీర్‌సింగ్‌ పోటీ చేస్తున్నారు.
► అమ్రోహాలో బీజేపీ సిటింగ్‌ సభ్యుడు కన్వర్‌సింగ్‌ తన్వర్, కాంగ్రెస్‌ నేత సచిన్‌ చౌధరీ రంగంలో ఉన్నారు. ఇటీవలి వరకూ జేడీఎస్‌లో ఉన్న కన్వర్‌ దానిష్‌ అలీ బీఎస్పీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు.  
► అలీగఢ్‌లో బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ సతీష్‌ కుమార్‌ గౌతమ్‌ మళ్లీ పోటీలో నిలవగా, మహాగఠ్‌ బంధన్‌ నుంచి అజిత్‌ బలియాన్‌ సవాల్‌ విసురుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ బ్రిజేష్‌సింగ్‌ తలపడుతున్నారు.


తన్వర్‌, రాజ్‌ బబ్బర్‌, సచిన్‌, కున్వర్‌, రాజ్‌వీర్‌, హేమమాలిని, రాజ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement