జైపూర్: ముల్లును ముల్లుతోనే తీసేయాలన్న సామెతకు ఆ ఎమ్మెల్యే విచిత్రమైన అర్థం చెప్పారు. మాదకద్రవ్యాల జోలికి పోవద్దని ప్రజలను హెచ్చరించే క్రమంలో.. డ్రగ్స్ కంటే గోల్డ్ స్మగ్లింగ్ ఉత్తమమని సలహాఇచ్చారు! అవికాస్తా సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
రాజస్తాన్‌లోని బిలారా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న బీజేపీ ఎమ్మెల్యే అర్జున్ లాల్ గార్గ్.. ఇటీవల ఓ ఆలయంలో దేవాసి తెగ పెద్దలతో సమావేశమయ్యారు. డ్రగ్స్ స్మగ్లిగ్ చేస్తూ పట్టుబడుతోన్నవారిలో ఈ(దేవాసి) తెగవారి సంఖ్య పెరిగిపోవడంపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘డ్రగ్స స్మగ్లింగ్‌లో బిష్ణోయ్ తెగలను మీరు(దేవాసీలు) మించిపోతున్నారు. దోనంబర్ దందా (అక్రమ వ్యాపారం) చేసుకోవాలనుకుంటే చేసుకోండిగానీ డ్రగ్స్ జోలికి మాత్రం పోవద్దు. దానికంటే గోల్డ్ స్మగ్లింగ్ చాలా సులభం. పైగా బెయిల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది’’ అని అన్నారు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద అరెస్టై జైళ్లలో మగ్గుతున్న దేవాసీల వివరాలు కోరుతూ శాసన సభలో ప్రశ్నించానని, మత్తుమందుల వినియోగం, అక్రమ రవాణాల కారణంగా దేవాసీ యువత పనికిరాకుండాపోతున్నారని ఎమ్మెల్యే అర్జున్ గార్గ్ తెలిపారు. కాగా, రాజస్తాన్‌లోని బిష్ణోయ్, దేవాసి తదితర తెగలకు సరైన ఉపాధి కల్పించడంలో బీజేపీ సర్కార్ విఫలం చెందిందనడానికి ఎమ్మెల్యే వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై ఎమ్మెల్యే గార్గ్ స్పందించాల్సిఉంది.
బిలారా బీజేపీ ఎమ్మెల్యే అర్జున్ లాల్ గార్గ్(ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment