బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్( పాత చిత్రం)
హైదరాబాద్ : మహిళలను వివస్త్రను చేసి బతుకమ్మ ఆడించిన నిజాంను తెలంగాణ సీఎం కేసీఆర్ పొగుడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు ఆదిలాబాద్ ,తాండూరుకి చెందిన జడ్పీటీసీ, సర్పంచ్‌లు, కార్యకర్తలు శుక్రవారం పార్టీలో చేరారు. విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్ అవినీతిని ఎండగట్టాలంటే బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. 19 రాష్ట్రాల్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చామో తెలంగాణలో కూడా అదేవిధంగా అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూవారీ ప్రక్రియగా బీజేపీలో అనేక మంది చేరుతున్నారని అన్నారు.
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి దోచుకుంది దాచుకుంది తప్ప చేసిందేమీ లేదన్నారు. అమిత్ షా, మోదీ ఇద్దరూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని నమ్మే తమ పార్టీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దళారి వ్యవస్థ మోదీ ప్రభుత్వంలో లేదని, మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ అందరి చూపు తమ పార్టీ వైపు చూసేలా చేస్తున్నారని అన్నారు. మహిళల ఆత్మ గౌరవం కాపాడేందుకు మరుగుదొడ్ల నిర్మాణం మోదీ చేపట్టారని తెలిపారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీనే ప్రత్యామ్నాయమని, ఇప్పుడున్న పార్టీలన్నీ కేవలం ప్రచారం కోసమే చూస్తున్నాయని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో భూ కుంభకోణాలు అధికమైపోయాయని, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బీసీ సంగ్రామ సభ జరపబోతున్నామని, అంతే కాకుండా నిరుద్యోగ, రైతు, మహిళల సమస్యలపై భవిష్యత్‌లో పోరాడుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో చాపకింద నీరులా చేరి ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగట్టి అధికారంలో వచ్చే విధంగా పోరాడుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment