
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ వేట ప్రారంభమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 15కి పైగా స్థానాల్లో గెలవాలనే వ్యూహంతో పావులు కదుపుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీకీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాని పక్షంలో తాము గెలిచే స్థానాలతో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని భావిస్తోంది. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న సీట్లపై మరింతగా దృష్టి సారించింది. రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రత్యేకంగా హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ ప్రచార వ్యూహాలను రూపొందించడంతోపాటు అభ్యర్థులకు సల హాలు, సూచనలు ఇస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ గెలుపు కోసం మరో నలుగురు కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నారు.
‘2, 3 స్థానాల’ సీట్లపై దృష్టి..
బీజేపీ సిట్టింగ్ స్థానాలైన ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, ఉప్పల్, గోషామహల్‌తోపాటు గత ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏడు చోట్ల రెండో స్థానంలో నిలవగా.. ప్రస్తుతం వాటిలోని రెండు చోట్ల అప్పటి అభ్యర్థులు లేరు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతోపాటు మిగిలిన స్థానాల్లో కచ్చితంగా గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, కల్వకుర్తి, ముధోల్, మల్కాజిగిరిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని విస్తృతం చేసి, బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. వాటితోపాటు గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన నిజమాబాద్ అర్బన్, మహబూబ్‌నగర్, సూర్యాపేట్, మునుగోడు, శేరిలింగంపల్లి, ఎల్‌బీ నగర్, వేములవాడ, దుబ్బాక, ఆంధోల్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆర్మూర్ తదితర స్థానాల్లోనూ కాషాయజెండా ఎగురేసేందుకు వ్యూహాలు ముమ్మరం చేసింది.
హోరెత్తనున్న ప్రచారం..
రాష్ట్రంలో తమ అభ్యర్థుల విజయం కోసం ముమ్మరంగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే మూడుసార్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేశారు. అలాగే యువ సమ్మేళనంలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర, అస్సాం సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరై రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇక ప్రధాని నరేంద్రమోదీతోపాటు యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని హోరెత్తించనుంది. పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు అవకాశమున్న నియోజకవర్గాల్లో మోదీ, అమిత్‌షా, ఇతర ముఖ్యనేతలు ప్రచార కార్యక్రమాలు ఉండేలా షెడ్యూల్ రూపొందించింది. ఈనెల 27న, వచ్చేనెల 3న ప్రధాని సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అమిత్‌షా ఈనెల 25, 28, వచ్చేనెల 2వ తేదీల్లో 10 సభలు, మూడు రోడ్‌షోల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేసింది.
ఇటీవలే బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద సేవలను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటోంది. ఆయన ఈనెల 22 నుంచి 48 నియోజవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. రిజర్వుడ్ స్థానాలే కాకుండా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది. పేదలకు రూ.5 లక్షల విలువైన వైద్య సహాయం అందించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ప్రజలకు అందకుండా, దాని అమలుకు ససేమిరా అంటున్న టీఆర్‌ఎస్ వ్యవహారాన్ని, ఆ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కాషాయదళం భావిస్తోంది. తద్వారా ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని స్థానాలు గెలిచి కింగ్ మేకర్ పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment