
మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యదర్శి, సునీల్ దేవధర్
సాక్షి, రైల్వేకోడూరు(కడప) : చంద్రబాబునాయుడు జీవితంలో మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కోఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. బుధవారం రైల్వేకోడూరు మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీలోని గాంధీనగర్ సమీపంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పట్టణంలోని ఎర్రచందనం పార్కులో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో తమ పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆపార్టీకి సరైన నాయకుడు లేడన్నారు. రాష్ట్రంలో గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు కోట్లాది రూపాయలు స్వాహా చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ చివరకు చంద్రబాబు తన కుమారుడు లోకేషుకు మాత్రమే జాబు ఇప్పించుకుని నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఇటీలవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు గొప్ప మార్పు కోరుకున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించడ ఆనందించదగ్గ విషయం అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టబోయే కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మద్దతునిస్తారన్నారు. రాష్ట్రంలో 25లక్షల మందిని బీజేపీలో చేర్పించాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.
కేంద్రప్రభుత్వం రైతుల కోసం ఎన్నో ప్రత్యేక పథకాలు ప్రవేశ పెడుతోందన్నారు. ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనతల సురేష్‌ను అభినందించారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ జయప్రకాశ్‌వర్మ ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు బీజేపీ లో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు శ్రీనాద్‌రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, సూర్యనారాయణరాజు, పోతుగుంట రమేష్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment