
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్ధుబాటు వివరాలను బీజేపీ-శివసేన కూటమి నేడు ప్రకటించనుంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఆదివారం మీడియా సమావేశంలో సీట్ల సర్ధుబాటును అధికారికంగా వెల్లడించనున్నారు. ఆదివారంతో దేవీ నవరాత్రులు ఆరంభమవుతున్న క్రమంలో ప్రకటన చేసేందుకు శుభసూచకంగా ఇరు పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు బీజేపీ చీఫ్ అమిత్ షాతో చర్చలు సానుకూలంగా జరిగాయని త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే పేర్కొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎంగా శివసైనికుడిని అందలం ఎక్కిస్తానని తన తండ్రి, దివంగత బాల్ థాకరేకు తాను వాగ్ధానం చేశానని కూడా ఉద్ధవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి కొనసాగుతారని బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలు కూటమి వర్గాల్లో చర్చకు తెరతీశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 21న పోలింగ్ జరగనుండగా, 24న ఫలితాలు వెలువడతాయి.
Comments
Please login to add a commentAdd a comment