‘మహా’ డ్రామాలో మరో ట్విస్ట్‌ | Congress not on board yet as Governor invites NCP to form govt in Maharashtra | Sakshi
Sakshi News home page

‘మహా’ డ్రామాలో మరో ట్విస్ట్‌

Published Tue, Nov 12 2019 1:53 AM | Last Updated on Tue, Nov 12 2019 7:55 AM

Congress not on board yet as Governor invites NCP to form govt in Maharashtra - Sakshi

గవర్నర్‌తో ఎన్సీపీ నేతలు అజిత్‌ పవార్‌ తదితరులు

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను మించిన ట్విస్ట్‌లతో మహారాష్ట్రలో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, దాంతో ‘మహా’ ఉత్కంఠకు తెరపడనుందని సోమవారం ఉదయం వరకూ అంతా భావించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చోటు చేసుకున్న వరుస నాటకీయ పరిణామాలు, అనూహ్య మలుపులు.. ‘మహా’ ఉత్కంఠను పెంచాయి. మద్దతు లేఖ ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఆఖరి నిమిషంలో ఇచ్చిన ట్విస్ట్‌తో శివసేన కంగుతిని, అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది.

గవర్నర్‌ను కలిసిన ఆదిత్య ఠాక్రే

మరో 48 గంటలు గడువు ఇచ్చేందుకు గవర్నర్‌ కోష్యారీ నిరాకరించడంతో రాజ్‌భవన్‌ నుంచి శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే బృందం నిరాశగా వెనుతిరిగింది. ఆ తరువాత, అనూహ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు రేసులో ఎన్సీపీ ముందుకు వచ్చింది. ఎన్సీపీని గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. స్పందించేందుకు 24 గంటల గడువు విధించి, నేటి(మంగళవారం) రాత్రి 8.30 వరకు ఏ విషయం చెప్పాలన్నారు. దాంతో  ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు ఏం చేయబోతున్నాయన్నది సస్పెన్స్‌గా మారింది.

ఉదయం నుంచి చర్చోపచర్చలు..
ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమై, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు కోరిన నేపథ్యంలో.. సోమవారం ఉదయం నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చర్చలు కొనసాగాయి. తొలుత పార్టీ చీఫ్‌ సోనియా నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో మరోసారి భేటీ అయ్యారు. సీనియర్‌ నేతలు ఖర్గే, అహ్మద్‌ పటేల్, కేసీ వేణుగోపాల్‌ తదితరులతో సోనియా చర్చలు జరిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అశోక్‌ చవాన్, పృథ్వీరాజ్‌ చవాన్, సుశీల్‌ కుమార్‌ షిండే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాలాసాహెబ్‌ తోరట్‌.. తదితరులు భేటీలో పాల్గొన్నారు.

ముఖ్యంగా శివసేనకు మద్దతివ్వాలా? వద్దా? ఇస్తే.. ప్రభుత్వంలో చేరాలా? లేక బయటనుంచి మద్దతివ్వాలా? మద్దతిచ్చేందుకు ఎలాంటి షరతులు విధించాలి? మద్దతివ్వడం లేదా ప్రభుత్వంలో చేరడం వల్ల పార్టీకి ఎలా ప్రయోజనకరం? తదితర అంశాలపై వారు చర్చించారు. శివసేనకు మద్దతివ్వడాన్ని కొందరు నేతలు వ్యతిరేకించారని, సైద్ధాంతికంగా విభేదాలున్న శివసేనకు మద్దతిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు నేతలు గట్టిగా వాదించినట్లు తెలిసింది.

శివసేనకు మద్దతివ్వాలని, ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం ఉండాలని మెజారీటీ ఎమ్మెల్యేలు కోరుకున్నట్లు సమాచారం. చివరకు, శివసేనకు మద్ధతిచ్చేందుకు పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చవాన్‌ ఖండించారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తామని హామీ ఇస్తూ ఎలాంటి లేఖను శివసేనకు కాంగ్రెస్‌ ఇవ్వలేదు. శివసేనకు మద్దతివ్వడానికి సంబంధించి కాంగ్రెస్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు.

సోనియాకు ఫోన్‌; పవార్‌తో భేటీ
ఇదే సమయంలో, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సోనియాగాంధీకి ఫోన్‌ చేసి, మద్దతు కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, సోనియా ఠాక్రేకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని ఠాక్రేకు చెప్పారని వెల్లడించాయి. సోనియాగాంధీకి ఉద్ధవ్‌ఠాక్రే చేసిన ఫోన్‌ కాల్‌పై ప్రశ్నించగా.. ‘అది మర్యాదపూర్వక ఫోన్‌కాల్‌ మాత్రమే’ అని ఆ తరువాత వేణుగోపాల్‌ మీడియాకు తెలిపారు. మరోవైపు, ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌తో ముంబైలోని ఒక హోటల్‌లో దాదాపు గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘ముంబైలో ఎన్సీపీ నేతలతో మంగళవారం తదుపరి చర్చలు జరుగుతాయని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మల్లిఖార్జున్‌ ఖర్గే తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు సోనియాగాంధీ నివాసంలో  నేడు ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు.

ఎన్సీపీకి పిలుపు
రాత్రి 8 గంటల సమయంలో అనూహ్యంగా, మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్‌ లేఖ పంపారు. దాంతో, ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్‌ పవార్‌ నేతృత్వంలో పార్టీ బృందం గవర్నర్‌ను కలిసి, తమ మిత్రపక్షం కాంగ్రెస్‌తో చర్చించేందుకు సమయం కావాలని, మంగళవారం రాత్రిలోగా తమ నిర్ణయం చెబుతామని వివరించారు.

శివసేనకు షాక్‌
కాంగ్రెస్‌ ప్రకటనతో ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు లభిస్తుందని, వారి నుంచి మద్దతు లేఖలు వస్తాయని ఆశించిన శివసేన ఒక్కసారిగా షాక్‌ తిన్నది. సాయంత్రం 7.30కు గవర్నర్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌కు ఆదిత్య ఠాక్రే బృందం వెళ్లి, మరో 48 గంటల గడువు కావాలని కోరింది. అందుకు గవర్నర్‌ నిరాకరించడంతో వారు నిరాశతో వెనుతిరిగారు. ‘గడువు పొడిగించేందుకు గవర్నర్‌ నిరాకరించారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మా ప్రతిపాదనను తిరస్కరించలేదు’ అని ఆదిత్య చెప్పారు. మరోవైపు, మోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వంలో శివసేన ఏకైక  మంత్రి అరవింద్‌ సావంత్‌ సోమవారం మంత్రిపదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతివ్వాలంటే ముందు ఎన్డీయే నుంచి వైదొలగాలంటూ శివసేనకు ఎన్సీపీ చేసిన డిమాండ్‌ నేపథ్యంలో సావంత్‌ ఆ నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామా లేఖతో అరవింద్‌ సావంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement