బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మార్చి గాంధీ భవన్ అని పెట్టుకోవాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి హితవు పలికారు. విలేకరులతో మాట్లాడుతూ..మానిపోయిన గాయాలను మళ్లీ తెరమీదకు తెస్తూ మీ స్వార్థ రాజకీయాల కోసం తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకులు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతారా అని ప్రశ్నించారు. విధానం, సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనేనని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో సొంతంగా పోటీ చేసే దమ్ముందా అని సూటిగా అడిగారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాక్యానించారు.
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ నిన్న మాట్లాడుతూ కర్నాటకలో కుమారస్వామి సీఎం అవ్వగా లేనిది తాను సీఎం కాలేనా అన్న విషయాన్ని గుర్తు చేశారు. అక్బరుద్దీన్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. పాతనగరంలో కేవలం ఏడు స్థానాలకు పరిమితమైన ఎంఐఎం పార్టీ నుంచి ఏవిధంగా సీఎం అవుతారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ, పాముకు పాలుపోసి పెంచిపోషిస్తుందని ఎంఐఎం నుద్దేశించి వ్యాఖ్యానించారు. మళ్లీ తెలంగాణాలో రజాకార్ల పాలన పునరుద్దరించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. సెక్యులరిజం అంటున్నటీఆర్‌ఎస్ ఇప్పుడు ఎంఐఎం మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బూటకపు సెక్యులరిజాన్ని తెలంగాణ ప్రజలు నమ్మకూడదని, నిజమైన సెక్యులరిజం ఉందంటే అది బీజేపీలోనే ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment