
జైపూర్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీపై రాజస్థాన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీచంద్ కృప్లానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. రాహుల్‌ను బీజేపీ స్టార్ కాంపైనర్‌గా వర్ణించారు. ప్రతాప్‌గఢ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
‘రాహుల్ గాంధీకి మేము కచ్చితంగా అభినందనలు తెలపాలి. బీజేపీకి ఆయన ప్రధాన ప్రచారకుడు. మా పార్టీ తరపున స్టార్ కాంపైనర్ ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీయే. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదు. స్వాతంత్ర్య సమరయోధుల సంఘం మాత్రమే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి, వివిధ రాజకీయ పార్టీలు ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని జవహర్‌లాల్ నెహ్రుతో మహాత్మాగాంధీ చెప్పారు. కానీ మన దురదృష్టం. గాంధీ మాటలను నెహ్రు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు మహాత్మా గాంధీ కలను సాకారం చేయడానికి రాహుల్ వచ్చారు. కచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తార’ని శ్రీచంద్ వ్యంగ్యంగా అన్నారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.