
సాక్షి, అమరావతి: స్వలాభాపేక్ష, మోసపూరిత ఆలోచనలతో చంద్రబాబు నాయుడు అప్పట్లో కుట్రపూరితంగా అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేశారని ఆక్షేపిస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ కోర్ కమిటీ శనివారం ఒక తీర్మానం చేసింది. అయినప్పటికీ గతంలో అన్ని పక్షాలు అమరావతిని రాజధానిగా తీర్మానించిన నేపథ్యంలో.. అక్కడే రాజధానిని కొనసాగించడం సమంజసమని ఆ తీర్మానంలో పేర్కొంది.
రాజధాని అంశంపై పార్టీ పరంగా ఒక స్పష్టమైన వైఖరిని బహిర్గతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ శనివారం గుంటూరులో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో నేతల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అనంతరం నేతలు ఏకాభిప్రాయంతో ఒక తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఈ తీర్మానం వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు విడుదల చేశారు.
బాబు మోసం
‘‘శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలను గత టీడీపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసి, ఏపీ ప్రజలను మోసగించింది. ఆ కమిటీ నివేదికను ప్రజల ముందుకు తీసుకొని రాకుండా స్వలాభాపేక్షతో కుట్రపూరితంగా అక్కడే (అమరావతిలో) రాజధానిని స్థాపించాలని నిర్ణయించడం చంద్రబాబు మోసపూరిత ఆలోచనలకు నిదర్శనం. రూ.లక్షల కోట్ల వ్యయంతో సింగపూర్ స్థాయి రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదించడం రాష్ట్ర ఆర్థిక వనరులపై భారం మోపడమే కాకుండా సాధ్యపడే విషయం కాదని శివరామకృష్ణన్ కమిటీ నివేదించింది’’ అని తీర్మానంలో బీజేపీ కోర్ కమిటీ పేర్కొంది.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ బీజేపీ పోరాటం చేయాలని నిర్ణయించినట్టు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో చెప్పారు. 15వ తేదీన పోరాట కార్యచరణను ప్రకటిస్తామన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోరుతూ తీర్మానం చేయాలన్న ప్రతిపాదనకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ అంగీకారం తెలపలేదు.
Comments
Please login to add a commentAdd a comment