
విజయనగరం అర్బన్ : కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే.. వాటిలో కమీషన్లు నొక్కేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోకులు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సైతం తన పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విజయనగరానికి శుక్రవారం వచ్చిన ఆయనకు కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయుడు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను ప్రజలకు చేర్చకుండా కొడుకు లోకేష్ సారధ్యంలో చంద్రబాబు దోచుకుంటున్నాడని ఆరోపించారు. పాలన చేతకాక బీజేపీని భూతంలా చూపించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన రూ.3,500 కోట్లలో ఇప్పటికే రూ.2,500 కోట్లను కేంద్రప్రభుత్వం ఇస్తే.. వాటికి ఇంతవరకు లెక్కలు చెప్పలేదని తెలిపారు. పదేళ్లపాటు హైదరాబాదులో ఉండే అవకాశం ఉన్నప్పటికీ..భయపడి పారిపోయి వచ్చి రూ.10,500 కోట్లు వెచ్చించి తాత్కాలిక అసెంబ్లీ నిర్మించి నిధులు భారీగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. పోలవరం నిధుల్లో రూ.1,600 కోట్లు బదలాయించి పట్టిసీమ కాలువ నిర్మాణం పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీగా రూ.16,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే వెచ్చించాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఇవ్వకుండా.. దోచుకునేందుకు నేరుగా నిధులివ్వాలని కోరుతున్నారని. అది సాధ్యం కాదని వివరించారు.
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేయడాన్ని చూసి రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారో తెలియని పరిస్థితిలో ప్రజలున్నారన్నారు. చంద్రబాబునాయుడి అవినీతి పాలనను ఏ పార్టీ నిలదీస్తున్నా.. దాని వెనుక బీజేపీ స్క్రిప్ట్ ఉందంటూ మతిభ్రమించి అపరిచితుడిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.