బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్: పధకం ప్రకారమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దాడి జరిగిందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీడీపీ నాయకుల చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లో శుక్రవారం లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ఒక రోజు ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ దాడి జరిగింది. ఇదే విషయాన్ని ఆ ఏరియా ఎస్పీ కూడా చెప్పారు. కానీ వాటిని పోలీసులు ఖాతరు చేయలేదు. ఈ విధమైన చర్యలు చేస్తే టీడీపీ చరిత్ర హీనమై పోతుంది. అమిత్ షాపై దాడి ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి. ఆయన కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగింది’ అని అన్నారు.
బీజేపీ దేశ వ్యాప్త విజయాలను జీర్ణించుకోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ గెలుపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాకుతుందనే భయంతో ఇలాంటివి చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏపీ ప్రజలు మీ పాలనపై, మీపై రాజకీయంగా చరమ గీతం పాడతారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై కావాలని యు టర్న్ తీసుకొని ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా పేరు ఎత్తితే జైల్లో పెట్టండి అని చెప్పింది మీరు కాదా అని లక్ష్మణ్ ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశ్నించారు.
అమిత్ షాకు బాబు క్షమాపణ చెప్పాలి
తిరుపతిలో వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చిన అమిత్ షా పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడుకు తెలిసే ఈ దాడి జరిగిందని, ఇందుకు బాబు బహిరంగంగా అమిత్ షాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరం వెంకటేశ్వర స్వామి భక్తులపై జరిపిన దాడిగా భావించాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ వేలమంది తెలంగాణ భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారని, కానీ తిరుపతిలో దాడి జరిగిన పరిస్థితి లేదు. నైతిక పతనం.. పాలక పార్టీ, చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
దాడిలో అమిత్ షా రెండో వాహనం అద్దాలు పగిలాయని, తిరుపతి చరిత్రలోనే ఇలాంటి ఘటన తొలిసారి అని కిషన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు అవకాశవాద వైఖరిని తెలుగు ప్రజలు గమనించాలని కోరారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అవినీతిని బయట పెడతారని చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా పై విశ్వాసం లేదని, ఆయన ప్రేమంతా 2019లో కుర్చీ నిలబెట్టుకోవటంపైనే ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు.
ఇది పిరికి పందల చర్య
అమిత్ షాపై టీడీపీ దాడి హేయమైనదని బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇది పిరికి పందల చర్య అని మండిపడ్డారు. నేటి నుంచి టీడీపీ పేరు తెలుగుదేశం రౌడీల పార్టీ (టీడీఆర్‌పీ) అని మార్చుకొంటే మంచిదని చెప్పారు. దైవ దర్శనానికి వచ్చిన నాయకుడిపై దాడికి దిగటం అమానుషమని అన్నారు. ప్రజల హృదయాలు గెలవలేని పార్టీలే దాడులు, హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తాయన్నారు. బాబు దీనిపై తక్షణమే స్పందించాలన్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ రాజకీయ సమాధి అవుతుందనటానికి ఇదే నిదర్శనమని చెప్పారు. టీడీపీ తెలుగు వారి ప్రతిష్టను దిగజార్చిందని, హామీలు నెరవేర్చకపోవడం వల్లనే దాడి చేశామంటే.. 500 హామీలు నెరవేర్చని టీడీపీ నాయకపలను ప్రజలు ఏమి చేయాలి.? అని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న ద్వేషంతోనే అమిత్ షా పై దాడికి దిగారని విష్ణు వర్ధన్ అన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యయుతంగానే టీడీపీ ప్రజాక్షేత్రంలో దాడులని ఎదుర్కొంటామని చెప్పారు. టీడీపీ దాడులకు, తాటాకు చప్పుళ్ళకి బీజేపీ భయపడదన్నారు. దైవ దర్శనానికి వచ్చిన వారిపై, రాజకీయాలకోసం దాడి చేసే సంస్కృతి టీడీపీ మాత్రమే నేడు ప్రారంభించిందని చెప్పారు. నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత టీడీపీ ఈ రోజు నుంచి కోల్పోయిందని, అమిత్ షా వాహనాల అద్దాలు పగులగొట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ క్రిమినల్ రాజకీయాలు తమంత తాముగా బయటపెట్టుకున్నారని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment