‘సీట్ల’ పెంపు కోసమేనా మిత్రభేదం? | BJP ,TDP fight is because of seats? | Sakshi
Sakshi News home page

‘సీట్ల’ పెంపు కోసమేనా మిత్రభేదం?

Published Sun, Jan 28 2018 2:30 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

BJP ,TDP fight is because of seats? - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం–బీజేపీ పొత్తుపై సీఎం చంద్రబాబు శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంలోనూ కేంద్రంతో సర్దుకు పోయిన చంద్రబాబు అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన రాజకీయ నిర్ణయంపై తుదకంటా మిత్రపక్ష బీజేపీపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతోనే తీవ్ర వ్యాఖ్యలకు సిద్ధపడ్డారని చర్చ మొదలైంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడంపై బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. ‘మాతో పొత్తు వద్దనుకుంటే చెప్పండి, ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటాం. ఆ తరువాత ఎవరి మాటలు వారు మాట్లాడుకుందాం’ అన్న వ్యాఖ్యల వెనుక ఉద్దేశమిదేనని భావిస్తున్నారు. గడువు ప్రకారం మరో 15 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో అసెంబ్లీ  పెంపు విషయంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మిత్రపక్షంపై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నెల 29వ తేదీ నుంచి మొదలు కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలే వచ్చే ఎన్నికలకు ముందు జరిగే ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో ఈ సమావేశాల్లోనే కేంద్రం సీట్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టేలా తుదకంటా బీజేపీపై ఒత్తిడి తెవాలన్నది చంద్రబాబు వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

ప్రధాని భేటీ తర్వాత..
ప్రత్యేకహోదాపై కేంద్రంపై రాజీపడిన చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన భేటీలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్నే ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే దీనిపై ప్రధాని నుంచి స్పష్టమైన సానుకూల సంకేతాలు వెలవడలేదని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విభజన హామీల అమలు కోసం కేంద్రంపై సుప్రీంకోర్టుకు వెళతామని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తామంటే దండం పెట్టి అప్పగిస్తామని రెండు నెలల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో వ్యాఖ్యలు చేయడం కూడా అప్పట్లో పెద్ద రాజకీయ దుమారాన్నే లేపింది.

ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు, జీఎస్‌టీ అంశాలపై కేంద్ర నిర్ణయాలను టీడీపీ నేతలు మాట్లాడుతుంటే పెద్దగా పట్టించుకోని చంద్రబాబు.. అదే సమయంలో రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఇక్కడి ప్రభుత్వ వైఫల్యాలను తప్పుపడితే మాత్రం మిత్రధర్మం అంటూ ఎదురుదాడికి సిద్ధపడడాన్ని కమలం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం, పోలవరం కాంట్రాక్టు పనుల్లో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడడం, రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించడం,  తాత్కాలిక భవనాల పేరిట తమ వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ కమీషన్లు దండుకోవడం వంటి అంశాలపై రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు అధికార పార్టీని నిలదీస్తూ వస్తున్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు వీటికి నిధులు ఇవ్వడం లేదంటూ కేంద్రంపై నిందలు వేయడాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశాలను వారు లేవనెత్తినప్పుడల్లా చంద్రబాబునాయుడు తన పార్టీ నాయకుల ద్వారా విమర్శలు చేయించడం, ఆ తరువాత వారిని మందలిస్తున్నట్లుగా నటించడం షరామామూలుగా మారిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల గురించి ప్రశ్నిస్తే.. 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని రాజీనామాలు కూడా చేయించకుండా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్‌ రాజు ప్రభుత్వాన్ని  నిలదీశారు. వారితో రాజీనామాలు చేయించాలని, అలా కాకుంటే ఏ పార్టీ నుంచి గెలిచినా ఫర్వాలేదు అధికారపార్టీలోకి తీసుకొని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చనే చట్టం చేయాలంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం అవే విమర్శలు మిత్రపక్ష నేతల నుంచే ఎదురు కావడం తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడల్లా తెలుగుదేశం నుంచి బీజేపీ పొత్తుపై ఇలాంటి విమర్శలు సాధారణమైపోయాయని బీజేపీ నేతలు పలు సంఘటనలను ఉదాహరిస్తున్నారు.

అయితే, గత కొద్ది కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా విమర్శలకు దిగడంపై కమలం నేతలు సీరియస్‌గా భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్ష బీజేపీ ప్రభుత్వంపై కేసులు వేస్తాననడం పొత్తు ధర్మం అవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల అవుతున్నప్పటికీ మిత్రపక్షానికి చెందిన ప్రధాని మోదీ ఫోటోను రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పథక ప్రచారంలోనైనా పెడుతున్నారా? అని నిలదీస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు నిర్ణయించారు. జనవరి 29వ తేదీ నుంచి మొదలుకానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందేమోనన్న ఆశల్లో ముఖ్యమంత్రితో సహా టీడీపీ నేతలు ఉన్నారని కమల నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అంశాన్ని బట్టి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తర్వాత టీడీపీ– బీజేపీల మధ్య మైత్రి వచ్చే ఎన్నికల్లో కొనసాగే అంశంపై స్పష్టత వస్తుందని రెండు మిత్రపక్ష పార్టీ నేతలూ చెబుతున్నారు. 

అడుగడుగునా వెన్నుపోట్లే...
గతంలో గుజరాత్‌తో సహా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పుడు ఏపీలో తమ పార్టీని బలోపేతం చేసుకోనున్నామని సోము వీర్రాజు ప్రకటించగా ఏపీలో బీజేపీ తినిపారేసే ఐస్‌క్రీమ్‌ పుల్లలాంటిదని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ విమర్శలు చేశారు. ఈ విమర్శల వెనుక చంద్రబాబు ఉన్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. దీనిపై వివాదం రేగడంతో రాజేంద్రప్రసాద్‌ను బాబు మందలించినట్లు లీకులిప్పించారు. మరో సందర్భంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తువల్లే టీడీపీకి మెజార్టీ తగ్గిపోయిందని, లేకుంటే విజయవాడ పార్లమెంటు స్థానంలో తనకు 1.25 లక్షల మెజార్టీ వచ్చేదని వ్యాఖ్యానించడం రెండు పార్టీల మధ్య పెద్ద దుమారమే లేపింది. అధిష్టానం నానితో మాట్లాడి సంయమనంతో ఉండాలని సూచించిందని అనుకూల మీడియాలో రాయించారు. రాష్ట్రాభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని, కేంద్రం నుంచి నిధులు రానివ్వకుండా చేస్తున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి గతంలో మీడియా సమావేశంలోనే విమర్శలు గుప్పించారు.

ఇవన్నీ చంద్రబాబు ప్రోద్బలం లేకుండా జరగడం లేదన్న విషయం తమకూ తెలుసునని బీజేపీ నేతలు చెబుతున్నారు. పోలవరం విషయంలో కేంద్రం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నా అనేక అవినీతి అక్రమాలతో పనులు ముందుకు వెళ్లకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని పేర్కొంటున్నారు. కమీషన్ల కోసం కొత్తగా టెండర్లు పిలవడాన్ని కేంద్రం నిలిపివేయించగా బీజేపీపై టీడీపీ నేతలతో విమర్శలు చేయించడమే కాకుండా స్వయంగా చంద్రబాబునాయుడు అసెంబ్లీలో కేంద్రం తీరును తప్పుబట్టే ప్రయత్నం చేశారు. ‘వద్దంటే చెప్పండి మీకో నమస్కారం పెట్టి ప్రాజెక్టును మీకే అప్పగించేస్తాం‘ తాజా వ్యాఖ్యల మాదిరే చంద్రబాబు మాట్లాడారని గుర్తుచేశారు. తాడేపల్లిగూడెంలో మంత్రి మాణిక్యాలరావుకు వ్యతిరేకంగా టీడీపీకి చెందిన జడ్పీ ఛైర్మన్‌ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని పేర్కొంటున్నారు. కాకినాడ నగర పాలక ఎన్నికల్లో బీజేపీకిచ్చిన సీట్లలో టీడీపీ అసమ్మతి నేతలను నిలబెట్టి ఎన్నికలు అయినపోయిన వెంటనే వారిని పార్టీలో చేర్చుకోవడం మిత్ర ధర్మమేనా అని ప్రశ్నిస్తున్నారు. మిత్రపక్షమైన తమను నంద్యాల ఉపఎన్నిక సమయంలో ప్రచారానికి రావద్దని, బీజేపీ జెండాలు కూడా ఏర్పాటు చేయనీకుండా అడ్డుకున్నారని, తమ ఉనికిని కూడా అంగీకరించలేకపోతున్నారని వారు గుర్తుచేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement