సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు పతాక స్ధాయికి చేరాయి. గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌తో కుట్రకు తెరలేపారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌లపై ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పాక్ హైకమిషనర్‌తో మణిశంకర్ అయ్యర్, సీనియర్ కాంగ్రెస్ నేత హమిద్ అన్సారీలు రహస్యంగా భేటీ అయ్యారని ప్రధాని వ్యాఖ్యానించడంపై చిదంబరం మండిపడ్డారు.గుజరాత్‌లో గత రెండు రోజులుగా బీజేపీ చేస్తున్న ప్రచారం దిగజారిందని, ఎన్నికల్లో గెలుపు కోసం ఓ రాజకీయ పార్టీ ఎంతకైనా తెగిస్తుందా అని చిదంబరం ట్వీట్ చేశారు.
ఎన్నికల్లో గెలుపు కోసం మాజీ ప్రధాని, మాజీ ఉపరాష్ర్టపతిలను వివాదంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రధాని నీచరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ సైతం అయ్యర్‌పై వేటువేసింది. దీంతో ఈ వివాదాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుని గుజరాత్ ప్రచార సభల్లో లేవనెత్తుతోంది. పాక్ హైకమిషనర్‌తో కాంగ్రెస్ నేతల రహస్య మంతనాలంటూ ప్రచారంలో ఊదరగొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment