P.chidambaram
-
తెలంగాణలోనే గ్యాస్ ధరలు ఎక్కువ: చిదంబరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. ఇదే క్రమంలో తెలంగాణతో తనకు 2008 నుంచి మంచి అనుబంధం ఉందని తెలిపారు. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, చిదంబరం తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన నాకు బాగా గుర్తు. తెలంగాణతో నాకు మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగింది. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే. జాతీయ సగటు కన్న ఎక్కువ. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పాల ధరలూ విపరీతంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయి. వ్యాట్ ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణే. గ్యాస్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉంది. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికం. రాష్ట్రంలో 15.1 శాతంగా ఉంది. 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. టీఎస్పీఎస్సీలో 22 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు. వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయింది. ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర అప్పులు 3.66 లక్షల కోట్లకు పెరిగింది. ఏటేటా అప్పులు భారీగా పెరిగాయి. ఫలితంగా ఒక్కొక్కరిపై 96 వేల రూపాయల అప్పు భారం పడింది. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారింది. విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయి. పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ మేనిఫెస్టో.. కొన్ని కీలక హామీలు ఇవే.. -
కాంగ్రెస్ పార్టీపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో బిహార్ ఎన్నికల రగడ ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించగా, తాజాగా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పి. చిదంబరం అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. అన్ని ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతోందని, సంస్థాగతంగా అది నిరూపితమవుతోందని అన్నారు. పార్టీ అనేక పరాజయాల్లో తాను నాయకత్వాన్ని బలపరిచానని, విధేయతతో మెలిగానని అన్నారు. బిహార్ ఎన్నికలలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అన్నిటి కన్నా మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం కింది స్థాయిలో కాంగ్రెస్ బలంగా లేదని తెలియజేస్తుందని అన్నారు. దీనికి కారణం క్షేత్ర స్థాయిలో కార్యాచరణ లోపించడం కానీ లేదా పార్టీ బలహీనపడిపోవడం కానీ కావచ్చని చెప్పారు. బీహార్ లో ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీల కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ... చివరకు ఫలితం తారుమారైందని అన్నారు. ఈ ఓటమిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరుస ఎదురు దెబ్బలతో కాంగ్రెస్ డీలా పడుతుందని సమీక్ష అవసరమని అన్నారు.సీపీఐ(ఎంఎల్)ఎంఐఎం వంటి చిన్న చిన్న పార్టీలు మంచి ఫలితాలు సాధించాయని,కారణం అవి సంస్థాగతంగా బలంగా ఉండటంతో సాధ్యమయిందన్నారు.ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరగవలసి ఉన్న ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘ఈ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వస్తాయో చూద్దాం’ అన్నారు. మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గాంధీయేతరులు పార్టీని నడిపించాలని పిలుపునిచ్చారు కదా అనే ప్రశ్నకు చిదంబరం జాగ్రత్తగా సమాధానం ఇచ్చారు. "ఎఐసిసి (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) సమావేశంలో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారో నేను చెప్పలేను. ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయవచ్చు" అని ఆయన అన్నారు. బిహార్‌లో పార్టీ ఓటమి తరువాత చాలా మంది తమ గళాన్ని విప్పుతున్నారు.పార్టీ పనితీరును సమీక్షించాలని, ఆత్మపరీశీలన చేసుకోవాలని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.కపిల్ సిబల్ అయితే బహిరంగంగా పార్టీ క్షీణించిందని,రాజకీయలను అర్థం చేసుకునే అనుభవజ్ఞులైన వారి చేతిలో పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ కూటమి బిహార్‌లో విజయానికి కొద్ది దూరంలో ఆగిందని, అయిన నిందలన్నీ మాపైనే పడ్డాయని విచారం వ్యక్తం చేశారు. 70 సీట్లలో పోటీ చేసినప్పటికీ 19 మాత్రమే గెలుచుకుందన్నారు.యూపీ,ఎంపీలో కీలకమైన సమయంలో చేతులెత్తేసిందని అన్నారు. -
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో వారికి బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న మొత్తం ఆరుగురు అధికారులకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మద్యంతర బెయిల్‌పై ఉన్నవీరికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిలో నీతి ఆయోగ్ మాజీ సీఈఓ సింధు శ్రీ, మాజీ ఓఎస్డి ప్రదీప్ కుమార్ బగ్గా, ఎఫ్ఐపీబీ మాజీ డైరెక్టర్ ప్రబోధ్ సక్సేనాకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎఫ్‌పీబీ యూనిట్ మాజీ సెక్షన్ ఆఫీసర్ అజీత్ కుమార్ డండుంగ్, అప్పటి అండర్ సెక్రటరీ రవీంద్ర ప్రసాద్, మాజీ జాయింట్ సెక్రటరీ (ఫారిన్ ట్రేడ్) డిఇఓ అనుప్ కె పూజారీలకు కూడా కోర్టు ఉపశమనం ఇచ్చింది. బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ .2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు, తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. అలాగే సాక్ష్యాలను దెబ్బతీయవద్దని కూడా స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపునకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్‌లో అవకతవకలు జరిగాయని రూ .305 కోట్ల విదేశీ నిధులను ముట్టాయని ఆరోపిస్తూ 2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత మనీలాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు. ఈకేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా నిందితుడుగా ఉన్నారు. -
‘ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది’
-
‘ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది’
సాక్షి, హైదరాబాద్ : దేశ చరిత్రలో జీడీపీ ఇంతగా పడిపోయిన సందర్భం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం వాపోయారు. గురువారం కేంద్ర బడ్జెట్ 2020 -21 పై ముఫ్ఖం జాహ్ కళాశాలలో చిదంబరం ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, జీడీపీ ఇంతలా దెబ్బతినడానికి నోట్ల రద్దు మొదటి కారణమైతే, జీఎస్టీ రెండవ కారణమని తెలిపారు. ఐసీయూలో ఉన్న ఆర్థిక వ్యవస్థను బయటకు తెచ్చే ఆలోచన కేంద్రం చేయడం లేదన్నారు. ఏ ఒక్క రంగంలో కూడా పూర్తి స్థాయిలో ట్యాక్స్‌లు వసూలు చేయలేకపోయిందన్నారు. అన్ని రంగాల్లో వృద్ధి లేదు కాబట్టే పన్ను వసూలు విషయంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిందని తెలిపారు. సబ్ కా సాత్... సబ్ కా వికాస్ అనే కేంద్రం పేదల ఫుడ్ సెక్యురిటీ నిధుల్లో కూడా కోతలు పెట్టిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని, ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అని మండిపడ్డారు. ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీంకి కూడా నిధుల కోత పెట్టిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజారిటీ కట్టబెట్టారని, తప్పటడుగులు వేయోద్దని అన్నారు. హైదరాబాద్‌లో రోడ్డువెంట ఉన్న బ్రాండెడ్ కంపెనీల షో రూమ్స్‌లో కస్టమర్లు లేకుండానే కనిపించారని, ఇదే పరిస్థితి చెన్నైలో కూడా ఉందని పేర్కొన్నారు. కస్టమర్లు లేకపోవడానికి ప్రధాన కారణం ప్రజల వద్ద డబ్బులు లేకపోవడవమే అని అన్నారు. ఆటో మొబైల్ రంగం బాగుంటేనే దేశ ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆటో మొబైల్ రంగం నాలుగు రోజులే పని చేస్తోందని అన్నారు. చాలా మంది వ్యాపార వేత్తలు టాక్స్ వేధింపులకు గురవుతున్నారని అన్నారు. టాక్స్ చెల్లింపు దారులకు ప్రస్తుతం వేధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. -
మోదీ మౌనం దురదృష్టకరం: చిదంబరం
న్యూఢిల్లీ: బీజేపీ ఆర్థిక విధానాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక వ్యవస్థ మందగమనం గురించి మౌనం వహించడం దురదృష్టకరమన్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన, ముందుచూపు లేదంటూ మండిపడ్డారు. కాగా యూపీఏ హయాంలో(2004-2014) 14 కోట్ల దేశ ప్రజలను పేదరికం నుంచి సాంత్వన కలిగిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో లక్షల మంది పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధి రేటును ఆర్బీఐ ఏడు శాతంగా అంచనా వేస్తే అది నాలుగు శాతానికే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని ఆభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పతనానికి నోట్ల రద్దు, జీఎస్టీని సరియైన పద్దతిలో అమలు చేయకపోవడం, విపరీతమైన పన్నులు, పీఎంవో ఆఫీసు కేంద్రీకృత నిర్ణయాలు ప్రధాన కారణాలని ఆయన ధ్వజమెత్తారు. కాగా, జైలు నుంచి విడుదలైన తర్వాత తనకు మొదట గుర్తొచ్చింది కశ్మీర్ ప్రజలేనని చిదంబరం తెలిపారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 106 రోజులు జైలులో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. కశ్మీర్ ప్రజలు ఆగస్టు 4, 2019 నుంచి స్వేచ్ఛ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే తాను కశ్మీర్ ప్రజలను కలుస్తానన్నారు. ఈ మధ్య ఓ పారిశ్రామికవేత్త (రాహుల్ బజాజ్) కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రజలు భయపడుతున్నారని విలేకర్ల ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఒక్క చోటే కాదు ప్రతిచోటా భయం ఉంది...మీడియా కూడా భయపడుతోందంటూ చిదంబరం వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంభానికి ఎస్పీజీ భద్రత అవసరంలేదని ప్రభుత్వం భావిస్తే సరిపోదని అనుకోని సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చిదంబరం అన్నారు. గ్రామీణ వినియోగం, వేతనాలు దారుణంగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
శక్తి యాప్‌తో కార్యకర్తకు శక్తి
సాక్షి, హైదరాబాద్: కార్యకర్తలకు శక్తినివ్వడానికే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ శక్తి యాప్‌ను క్రియేట్ చేయించారని టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. యాప్ రిజిస్ట్రేషన్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అధ్యక్షతన గాంధీభవన్‌లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించడం కోసమే.. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు తెలిపారు. రాహుల్ ఆదేశాల మేరకే శక్తి యాప్ రివ్యూ మీటింగ్ కోసం చిదంబరం తెలంగాణకు వచ్చారన్నారు. ప్రతి రోజు కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాన్ని తెలియజేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌లో శక్తి యాప్ మరింత అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే యాప్‌లో లక్ష మెంబర్ షిప్ దాటిందని ఉత్తమ్ తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. వీహెచ్ గరంగరం అంబర్‌పేటలో నూతి శ్రీకాంత్ అనే నేత శక్తి యాప్‌లో కార్యకర్తలను చేర్పించారని తెలిపిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను చేర్పించిన ఘనత శ్రీకాంత్ ఒక్కడికే ఇవ్వడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా కార్యకర్తలను ఎలా చేర్పిస్తావంటూ రాంమోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనతో పెట్టుకోవద్దంటూ వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. -
చిదంబరానికి మరోసారి ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరంను మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి జూన్ 12న చిదంబరం వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు మరోసారి విచారణకు హాజరవ్వాలని ఈడీ సమన్లు జారీ చేసింది. 3,500 కోట్ల రూపాయల ఎయిర్‌సెల్ –మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంను ఈడీ విచారించింది. ఎయిర్‌సెల్- మ్యాక్సిస్‌కు సంబంధించి అంతభారీ మొత్తంలో ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంలో ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై.. అప్పటి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ) అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ ఆయనను ప్రశ్నించింది. జూలై 10 వరకు అరెస్టు చేయొద్దు ఈ కేసుకు సంబంధించి తనను అరెస్టు చేయకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో చిదంబరానికి ఊరట లభించింది. జూలై 10 వరకు చిదంబరంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. -
‘గెలుపు కోసం దిగజారారు’
సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు పతాక స్ధాయికి చేరాయి. గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌తో కుట్రకు తెరలేపారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌లపై ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాక్ హైకమిషనర్‌తో మణిశంకర్ అయ్యర్, సీనియర్ కాంగ్రెస్ నేత హమిద్ అన్సారీలు రహస్యంగా భేటీ అయ్యారని ప్రధాని వ్యాఖ్యానించడంపై చిదంబరం మండిపడ్డారు.గుజరాత్లో గత రెండు రోజులుగా బీజేపీ చేస్తున్న ప్రచారం దిగజారిందని, ఎన్నికల్లో గెలుపు కోసం ఓ రాజకీయ పార్టీ ఎంతకైనా తెగిస్తుందా అని చిదంబరం ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం మాజీ ప్రధాని, మాజీ ఉపరాష్ర్టపతిలను వివాదంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రధాని నీచరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ సైతం అయ్యర్‌పై వేటువేసింది. దీంతో ఈ వివాదాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుని గుజరాత్ ప్రచార సభల్లో లేవనెత్తుతోంది. పాక్ హైకమిషనర్‌తో కాంగ్రెస్ నేతల రహస్య మంతనాలంటూ ప్రచారంలో ఊదరగొడుతోంది. -
‘నోట్లు రద్దు’కు నోబెల్ పురస్కారం!
- ఆర్బీఐపై చిదంబరం సెటైర్లు - లాభం 16 వేల కోట్లైతే.. కొత్త నోట్ల ప్రింటింగ్‌కు 21 వేల కోట్లు న్యూఢిల్లీ: నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి మాత్రమే నోట్ల రద్దు ప్రక్రియ పనికొచ్చిందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శించారు. అసలు నోట్ల రద్దును ప్రతిపాదించిన రిజర్వ్‌బ్యాంక్ ఆర్థికవేత్తలకు నోబెల్ పురస్కారం ప్రకటించాలని సెటైర్లు వేశారు. రద్దయిన పెద్ద నోట్ల లెక్కల వివరాలను బుధవారం ఆర్బీఐ వెల్లడించిన కొద్దిసేపటికే చిదంబరం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ‘‘మొత్తం రూ.15.44 లక్షల కోట్ల విలువైన కరెన్సీని రద్దు చేశారు. తిరిగి బ్యాంకుల్లోకి చేరకుండా మిగిలింది కేవలం ఒక్క శాతం అంటే రూ.16వేల కోట్లు! నిజంగా ఆర్బీఐ సిగ్గుపడాల్సిన విషయం ఇది’’ అని వ్యాఖ్యానించారు. కొత్త నోట్ల ముద్రణకు రూ.21వేల కోట్లు: ‘‘మొత్తం నోట్ల రద్దు ప్రక్రియ ద్వారా ఆర్బీఐకి లాభించింది(వెనక్కిరాని ఒక్క శాతం) 16 వేల కోట్లు. అదే కొత్త నోట్ల ప్రింటింగ్‌కు అయిన ఖర్చు రూ.21 వేల కోట్ల పైమాటే! వారెవా!! నిజంగా నోట్ల రద్దు ఐడియాను రికమండ్ చేసిన ఎకనమిస్టులకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే’’ అని సెటైర్ వేశారు నోట్ల రద్దు లక్ష్యం ఇదేనా?: డీమానిటైజేషన్‌లో భాగంగా 99 శాతం కరెన్సీని చట్టబద్ధంగా మార్చేశారని, ముమ్మాటికి ఇది నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి తప్ప మరొకటి కాదని చిదంబరం అన్నారు. (చదవండి: రద్దయిన పెద్ద నోట్ల లెక్క తేలింది) -
'ఆ మూడింటితో గెలవలేరు'
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో చివరికి ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. గుజరాత్లో అత్యంత ఉఠ్కంతభరితంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులకు పటేల్ గెలుపు కనువిప్పు కావాలని కాంగ్రెస్ పేర్కొంది. 'డబ్బు, కండబలం, కుతంత్రంతో విజయం సాధించలేరు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బలహీన ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చింది. కానీ పార్టీని చీల్చలేకపోయింద'ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ట్వీట్ చేశారు. ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును ఆయన ప్రశంసించారు. యుద్ధంలో గెలవడం కష్టమేనని, విజయం సాధించేందుకు ప్రభుత్వం చాలా కష్టపడిందని చివరకు ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అహ్మద్ పటేల్‌కు ఆమె అభినందనలు తెలిపారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సత్యం గెలిచిందని, అహం ఓడిపోయిందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జివాల్ అన్నారు. అహ్మద్ పటేల్ విజయంతో బీజేపీ చెప్పిందంతా బూటకమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. -
'చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాల్సిందే'
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నివేదికను కోర్టుకు సమర్పించింది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను నిందితుడిగా చేర్చాలంటూ బీజేపీ సీనియర్ నేత బ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈనెల 23న చేపట్టనున్నట్టు సమాచారం. -
ప్రత్యక్ష రాజకీయాలకు చిదంబరం స్వస్తి!
పుదుకొట్టాయ్(తమిళనాడు): ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం తెలిపారు. 8 ఎన్నికల్లో పాల్గొని, 17 ఏళ్లు మంత్రిగా ఉన్న తాను పూర్తిగా సంతృప్తి చెందానని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పుదుకొట్టాయ్‌కు సమీపంలోని తిరుమయ్యం వద్ద జరిగిన బీసీల సదస్సులో చిదంబరం ప్రసంగించారు. ‘‘నేనేమీ జౌళి వంటి సాధారణ శాఖల్లో మంత్రిగా చేయలేదు. ఇలాంటి శాఖల్లో చేసుంటే ప్రశాంతంగా ఉండేది. కానీ, నేను హోం, ఆర్థిక శాఖలకు మంత్రిగా ఉన్నాను. రోజుకు 18 గంటలపాటు కష్టపడి పనిచేశాను. ప్రస్తుతం 68 ఏళ్లు. ఇంకెంత కాలమని రాజకీయాల్లో ఉంటాను?. శేష జీవితాన్ని మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ప్రజా సేవలో గడుపుతాను’’ అని అన్నారు. తనకు ఒక్క పైసా అప్పులేదని, తానెవరికీ బాకీలేనని చెప్పిన చిదంబరం, పునర్జన్మలపై నమ్మకం లేదంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. -
కారు.. బైకు.. చవక
* తగ్గనున్న కార్లు, టూవీలర్ల ధరలు * 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిన ఎక్సైజ్ సుంకం * బియ్యం నిల్వ, లోడింగ్, అన్‌లోడింగ్‌పై సర్వీస్ ట్యాక్స్ మినహారుుంపు * ఉత్పాదక వస్తువులపైనా పన్ను * 12 నుంచి 10 శాతానికి తగ్గింపు * టీవీలు, ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్ ఓవెన్లూ ఇక చవక * అన్ని మొబైల్ ఫోన్లపై 6 శాతం ఎక్సైజ్ పన్ను న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌ను పురస్కరించుకుని.. తయూరీరంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కొన్ని పన్ను రాయితీలు ప్రకటించింది. దీంతో ఎస్‌యూవీలు (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) సహా చిన్నకార్లు, ద్విచక్ర వాహనాల ధరలు తగ్గనున్నాయి. నిర్మాణపరమైన ఉత్పాదకత కూడా గత కొద్దినెలలుగా మందగమనంలో ఉంది. దీంతో కొన్ని ఉత్పాదక వస్తువులు, వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపైనా ఆర్థికమంత్రి చిదంబరం పన్ను తగ్గింపును ప్రకటించారు. దీంతో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వస్తువుల ధరలూ తగ్గనున్నారుు. - అమ్మకాలు తగ్గిన ఆటోమొబైల్ పరిశ్రమకు ఉపశమనం కలిగేలా కార్లు, వాణిజ్య వాహనాలపై ప్రభుత్వం సుంకాన్ని తగ్గించింది. చిన్న కార్లు, మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై 12 శాతంగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని 8 శాతానికి తగ్గించింది. ఎస్‌యూవీలపై పన్ను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. పెద్ద వాహనాలపై సుంకం 27 శాతం నుంచి 24 శాతానికి, మధ్యతరహా కార్లపై పన్ను 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు వచ్చే జూన్ 20 వరకు వర్తిస్తుంది. - బియ్యం లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, నిల్వపై సర్వీస్ ట్యాక్స్‌ను (సేవాపన్ను) మినహారుుస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది. కార్డ్ బ్లడ్ బ్యాంకులందించే సేవలను కూడా సేవా పన్ను నుంచి మినహాయించారు. - అలాగే కొన్ని ఉత్పాదక వస్తువులు, వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర వస్తువులపై 12 శాతంగా ఉన్న పన్నును 10 శాతానికి తగ్గించారు. ఇది ఈ ఏడాది జూన్ 30 వరకు వర్తిస్తుంది. - దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు దిగుమతులను నిరుత్సాహ పరిచే దిశగా అన్ని కేటగిరీల మొబైల్ ఫోన్ల (హ్యాండ్సెట్లు)కు సంబంధించిన ఎక్సైజ్ సుంకాలను 6 శాతానికి పునర్వ్యవస్థీకరించారు. దీంతో రూ.2 వేల లోపు ఉండే తొలిస్థారుు హ్యాండ్సెట్ల ధర పెరగనుంది. - సబ్బులు, ఓలియో రసాయనాల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక చమురు, సంబంధిత ఉత్పత్తులు, కొవ్వుతో కూడిన ఆమ్లాలు, కొవ్వుతో కూడిన మద్యంపై దిగుమతి సుంక నిర్మాణాన్ని 7.5 శాతం వద్ద హేతుబద్దీకరించింది. ఈఈపీసీ హర్షం ముంబై: కార్లు, టూ వీలర్లపై సుంకాన్ని తగ్గించడంపై ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారుల సంస్థ (ఈఈపీసీ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతికి ఊతం ఇస్తుందని ఈఈపీసీ చైర్మన్ అనుపమ్ షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వదేశీ వాహన పరిశ్రమలో తిరిగి వృద్ధిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. మనకు 2000 కోట్లు కోత.. తగ్గిన కేంద్ర పన్నుల వాటా - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల వాటాను రూ. 22,131.68 కోట్లకు తగ్గించిన కేంద్రం - వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా 26,970 కోట్లు - గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లోనూ కోత సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వస్తాయనుకున్న నిధుల్లో రూ.2,000 కోట్ల మేర తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులను కూడా సవరించారు. ఈ సవరణలతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పన్నుల వాటా నుంచి రావాల్సిన నిధుల్లో రూ.2,000 కోట్ల మేర తగ్గనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ తొలి అంచనాల్లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.24,132.36 కోట్లు కేటాయించారు. ఇప్పుడు సవరించిన అంచనాల్లో రూ.22,131.68 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.27,028 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలపగా, కేంద్ర బడ్జెట్లో మాత్రం రూ.26,970 కోట్లు కేటాయించారు. అంటే రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా రూ.58 కోట్లు తగ్గుతోంది. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు రూ.77,060 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం గత బడ్జెట్లో పేర్కొంది. అయితే ఇప్పుడు సవరించిన అంచనాల్లో ఈ గ్రాంట్లను రూ.61,700 కోట్లకు తగ్గించారు. ఈమేరకు రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు కూడా తగ్గనున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.43,776 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు సవరించిన అంచనాల్లో ఈ నిధులను రూ.39,836 కోట్లకు తగ్గించింది. అంటే రాష్ట్రానికొచ్చే ప్రాయోజిత పథకాల నిధులు కూడా తగ్గిపోనున్నాయి. ఇవి తగ్గుతాయ్.. * బియ్యం, సబ్బులు * మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు * చిన్నకార్లు, ఎస్‌యూవీలు * వాణిజ్య వాహనాలు * దేశంలో తయూరైన మొబైల్ ఫోన్లు * టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు * కంప్యూటర్లు, ప్రింటర్లు, కీబోర్డులు, మౌజ్‌లు, హార్డ్ డిస్క్‌లు, స్కానర్లు * వ్యాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, హెరుుర్ డయ్యర్లు * వాటర్ కూలర్లు, టార్చ్లైట్లు, డిజిటల్ కెమెరాలు * ఎలక్ట్రిక్ ఐరన్స్, ఎంపీ 3..డీవీడీ ప్లేయర్లు * బ్లడ్ బ్యాంకుల చార్జీలు తొమ్మిదోసారి... ఫిబ్రవరి 17, 2014 పి.చిదంబరం తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు (8 సాధారణ, 2 మధ్యంతర బడ్జెట్లు) మొరార్జీ దేశాయ్ పేరున ఉంది. స్వాతంత్య్రం తరువాత ఇప్పటివరకు మధ్యంతర, ప్రత్యేకమైనవి కలిపి మొత్తం 83 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. స్టూడెంట్స్‌కు గాలం! విద్యా బడ్జెట్లో దేనికి ఎంతెంత..? ఉన్నత విద్య- రూ.16,200 కోట్లు పాఠశాల విద్య-రూ.51,198 కోట్లు న్యూఢిల్లీ: విద్యారంగానికి కాస్త ఫర్లేదు.. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.67,398 కోట్లు కేటాయించారు. ఈ నిధులు కిందటేడాదితో పోలిస్తే దాదాపు 9 శాతం అదనం. అలాగే యూపీఏ సర్కారు ఎన్నికల ముంగిట విద్యార్థులను ఆకట్టుకునే యత్నం చేసింది. 2009, మార్చి 31కి ముందు విద్యా రుణాలు తీసుకొని 2013, డిసెంబర్ 31 వరకు వడ్డీ చెల్లించని విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో వడ్డీని పూర్తిగా తామే భరిస్తామని చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ ప్రతిపాదనతో 9 లక్షల మంది విద్యార్థులకు రూ.2,600 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కెనరా బ్యాంకుకు బదిలీ చేయనున్నట్టు తెలిపారు. 2009-10 బడ్జెట్లో ప్రణబ్ ముఖర్జీ... విద్యార్థులు తీసుకున్న రుణాల్లో వడ్డీపై రాయితీ ఇచ్చేందుకు సెంట్రల్ స్కీమ్ ఫర్ ఇంటరెస్ట్ సబ్సిడీ(సీఎస్ఐఎస్) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలను కెనరా బ్యాంకుకు అప్పజెప్పినవిషయం తెలిసిందే. -
ఆ బాధ్యతంతా పీఎస్యూలదే
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న మొండి బకాయిల (ఎన్పీఏ) బాధ్యత ప్రభుత్వ రంగ బ్యాంకులదేనని ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పష్టంచేశారు. ఇందుకు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించటం సమంజసం కాదన్నారు. శనివారమిక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) 20వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్పీఏల బాధ్యత ఆయా బ్యాంకుల బోర్డులదే. రికవరీ విధానాలు ప్రస్తుతం కొంత సరళంగా ఉన్న మాట నిజం. అవి మారాల్సి ఉంది. అయితే బ్యాంకుల రుణ రేటు పెరుగుతోంది కనక ఎన్పీఏలు పెరిగినా సరే ప్రభుత్వం వాటికి తాజా మూలధనాన్ని అందిస్తోంది’’ అని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... మార్కెట్ అక్రమాలను నిరోధించడానికి వీలుగా రెగ్యులేటర్ సెబీకి మరిన్ని అధికారాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి సంబంధించి సభా సంఘం తన నివేదికను ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు సమర్పించకపోతే మూడో సారి సైతం ఆర్డినెన్స్‌ను పొడిగించాల్సి ఉంటుంది. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఎఫ్ఎస్ఎల్ఆర్సీ సిఫారసుల ప్రకారం ద్రవ్య పరపతి విధానం రూపకల్పన, బ్యాంకింగ్ రెగ్యులేషన్ మినహా ఆర్బీఐ నిర్వహిస్తున్న ఇతర కార్యకలాపాలు కొన్నింటిని సమీక్షించాల్సి ఉంది. వీలైతే ఆయా అధికారాలను ప్రభుత్వం లేదా ఇతర నియంత్రణ సంస్థలకు అప్పగించాలి. -
ఆర్థిక వ్యవస్థ నత్తనడకే..
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదని, రికవరీ సంకేతాలు ఇంకా ప్రస్ఫుటంగా కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య అసోచాం ఒక నివేదికలో పేర్కొంది. పెట్టుబడుల రాక మళ్లీ మొదలైందన్న సంకేతాలు వస్తేనే ఎకానమీ పూర్తిగా కోలుకోగలదని తెలిపింది. రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మళ్లీ 8 శాతం ఆర్థిక వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దోహదపడగలవని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో అసోచాం నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రెండు డజన్ల మేర పారిశ్రామిక విభాగాల్లో ఉత్పత్తి పడిపోయింది. డిమాండ్ మళ్లీ పెరిగితే తప్ప పెట్టుబడులు రావడం కష్టమని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. యంత్రపరికరాల రంగం కోలుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కీలకమైన తయారీ రంగంలో పెట్టుబడుల పరిస్థితికి కొలమానంగా నిల్చే యంత్రపరికరాల రంగం ఇంకా కష్టకాలంలోనే ఉందని వివరించారు. డిమాండ్ మందగించడాన్ని ఇది సూచిస్తుందన్నారు. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో యంత్రపరికరాల విభాగం 0.7 శాతం ప్రతికూల వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 14.2 శాతం ప్రతికూల వృద్ధి కనపర్చింది. ఇలాంటి పరిస్థితి చాలా ఆందోళనకరమైనదని అసోచాం పేర్కొంది. ఈ రంగంలో ఇప్పటికే భారీ నిల్వలు పేరుకుపోయాయని వివరించింది. ఈ నిల్వలు పూర్తిగా వినియోగమై, సానుకూల పరిస్థితులు ఏర్పడి కొత్త పెట్టుబడులు రావాలంటే మరికాస్త సమయం పడుతుందని పేర్కొంది. రికవరీ సంకేతాలను పక్కనపెడితే హాట్రోల్డ్ స్టీల్, చక్కెర పరిశ్రమలకు ఉపయోగపడే యంత్రపరికరాల ఉత్పత్తి సెప్టెంబర్‌లో గణనీయంగా తగ్గిందని అసోచాం నివేదిక వివరించింది. ఇక కలర్ టీవీల అమ్మకాలు 30 శాతం పడిపోగా, వాణిజ్య వాహనాల విక్రయాలు 28.5 శాతం క్షీణించాయి. ఇటువంటి పరిస్థితుల్లో.. ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రభుత్వం వ్యయాలను తగ్గించుకోనుండటం మరింత ఆందోళనకరమైన సంకేతాలు పంపుతోందని నివేదిక వ్యాఖ్యానించింది. ద్రవ్యలోటును కట్టడి చేయడం ముఖ్యమే అయినప్పటికీ.. అత్యధికంగా సేవలు, వస్తువులను కొనుగోలు చేసే ప్రభుత్వం వ్యయాలు తగ్గించేయడం వల్ల వ్యాపార పరిస్థితులు మరింత దెబ్బతింటాయని తెలిపింది. -
ఉద్యమాలతో పేదరికాన్ని తొలగించలేము:చిదంబరం
పనాజీ: ఉద్యమకారులపై కేంద్రమంత్రి పి.చిదంబరం నోరు పారేసుకున్నారు. ఉద్యమకారులు అదే పనిగా ఆందోళన చేపట్టడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని ఆయన కొత్త భాష్యం చెప్పారు. గోవాలోని థింక్ ఫెస్ట్ ఈవెంట్ కు ఆదివారం హాజరైన చిదంబరం పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాలతో దేశంలోని పేదరికాన్ని తొలగించలేమని తెలిపారు. అసలు ఉద్యమాలతో పేదరికం పెరుగుతుందే తప్ప దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు. విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, బొగ్గు గనుల ప్రాజెక్టుల పనులు జరగకుండా ఆందోళన చేపట్టడం ఉద్యమకారులకు తగదని ఆయన హితవు పలికారు. వాటి వల్ల నష్టం తప్పే, లాభం ఏమీ ఉండదన్నారు. ఉద్యమాలతో ఎవరైనా పేదరికాన్ని తగ్గించగలరా?అని ఆయన సవాల్ విసిరారు. ఆందోళన కారులు ప్రభుత్వానికి తగిన సలహాలు ఇస్తూ మరింత ముందుకెళ్లేందుకు సహకరించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పథంలో పయనించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. -
సేవా పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు పి. చిదంబరం
చెన్నై: సేవా పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం హెచ్చరించారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారి గురించి ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా పన్ను ఎగవేత ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పది మంది అరెస్టయ్యారని చిదంబరం తెలిపారు. సర్వీస్ ట్యాక్స్ ఎగవేత ఎక్కువగా ఉండే కన్సల్టెన్సీ, ఐటీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తోందని ఆయన చెప్పారు. కొన్ని నగరాల్లో ఇది తీవ్ర స్థాయిలో ఉండటాన్ని తాను గమనించినట్లు చిదంబరం చెప్పారు. ఉదాహరణకు చెన్నైలో కాంట్రాక్టు సర్వీసులు, అడ్వర్టైజ్మెంట్, ఐటీ, కన్సల్టెన్సీ తదితర రంగాల్లో ఇలాంటి ధోరణి కనిపించిందన్నారు. స్వచ్ఛందంగా సేవా పన్ను చెల్లించడాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వీసీఈఎస్ పథకంపై పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా చిదంబరం ఈ విషయాలు చెప్పారు. రూ. 50 లక్షలకు మించి ఎగవేసిన వారిపై మాత్రం అరెస్టు అస్త్రం ప్రయోగిస్తున్నామని, ఇది చిన్న మొత్తం కాదని ఆయన తెలిపారు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారి గురించి తమ దగ్గర వివరాలు లేవనుకోరాదని, తమ దగ్గర పుంఖానుపుంఖాలుగా సమాచారం ఉందని చెప్పారు. అయితే, శాఖాపరమైన పరిమితుల వల్లే అందరిపై తక్షణ చర్యలు సాధ్యపడటం లేదు తప్ప అంతిమంగా నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పవని చిదంబరం హెచ్చరించారు. -
కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ మధ్య మహాభారత యుద్ధమే
తిరుచిరాపల్లి(తమిళనాడు): వచ్చే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కు, నరేంద్ర మోడీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించిన ఆరెస్సెస్‌కు మధ్య మహాభారత యుద్ధమే కాగలవని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ఆయన శనివారం రాత్రి ఇక్కడ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. రాజకీయేతర సంస్థగా చెప్పుకుంటున్న ఆర్ఎస్ఎస్ పరోక్షంగా రాజకీయాలను తన చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ముఖాన్ని(బీజేపీని) పరోక్షంగా తన నియంత్రణలో నడిపిస్తున్న సంస్థకు, కాంగ్రెస్‌కు మధ్య రాబోయే ఎన్నికలు మహాభారత యుద్ధాన్ని తలపించనున్నాయన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నించడం ద్వారా ప్రజలను మతప్రాతిపదికపై చీల్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని చిదంబరం ఆరోపించారు. గుజరాత్లో జరిగిన ఎన్కౌంట ర్లలో ఎక్కువ మంది ముస్లిం యువకులే మృత్యువాత పడ్డారని ఆరోపించారు. అప్పట్లో కేంద్ర హోం మంత్రిగా ఉన్న తాను ఈ తరహా ఎన్కౌంటర్లు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నట్టు చెప్పారు. ఉగ్రవాదులుగానీ, నేరస్తులుగానీ కాల్పులకు తెగించినప్పుడు తప్పిస్తే.. వారిని సజీవంగా పట్టుకోవాలని తాను భద్రతా దళాలకు ఆదేశాలిచ్చానని చెప్పారు. సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటి అనేక విప్లవాత్మక చట్టాలను తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు. -
'2014లో మళ్లీ అధికారంలోకి వస్తాం'
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ధీమా వ్యక్తంచేశారు. ‘మేము అధికారంలోకి వచ్చేందుకు భారత్ మళ్లీ మాకే ఓటేస్తుందన్న విషయం మీ అధ్యయనంలోనూ రూఢీ అవుతుంది’ అని చిదంబరం గురువారం వాషింగ్టన్లో ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ నిర్వహించిన కార్యక్రమంలో చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకుల వార్షిక ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు చిదంబరం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన పరిణామాలపై కార్నెగీ అనే అమెరికా సంస్థ ‘ఇండియా డిసెడైడ్ 2014’ పేరుతో అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు దీనిపై అనవసరంగా మీ సమయాన్ని వృథాచేసుకోవద్దు’ అని ఎన్నికల ఫలితాల గురించి చిదంబరం చెప్పడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. అక్కడ ఒబామా పరిపాలనా యంత్రాంగం, మేథావులు, విద్యావేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు తదితర ప్రముఖులున్నారు. -
విభజనపై చర్చకు వచ్చిన మంత్రులు ముగ్గురే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విధివిధానాలను ఖరారు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సోమవారం తొలిసారిగా సమావేశమైంది. అయితే, తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునితో ఏర్పాటైన జీఓఎం సమావేశానికి ముగ్గురు మాత్రమే హాజరు కావడంతో పరిశీలనాంశాలపై ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి పి.చిదంబరం, సిబ్బంది శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి మాత్రమే పాల్గొన్నారు. ఈ కమిటీ సభ్యుడైన మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి పల్లంరాజు మంత్రి పదవికి రాజీనామా సమర్పించినందున ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. రాష్ట్రవిభజన ప్రక్రియలో రెండు రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను నిర్ణయించడంతో పాటు ఆస్తులు, అప్పుల పంపకం, సిబ్బంది, నిధుల కేటాయింపులు, జలవనరులు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీతో పాటు ఉమ్మడి రాజధాని నగర పరిపాలనా వ్యవస్థ స్వరూప స్వభావాలు, అన్ని ప్రాంతాల ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడం, తగిన భద్రత కల్పించడం వంటి పలు అంశాలను లోతుగా అధ్యయనం చేసి మంత్రుల బృందం ఆరు వారాల్లో కేంద్ర మంత్రివర్గానికి నివేదించా ల్సి ఉంది. జీఓఎం అధ్యయనం చేయాల్సిన వివిధ అంశాలపై ఆయా మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులైన నిపుణులతో కూడిన ఉపసంఘాలను ఏర్పాటు చేసే విషయమై ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గానికి జీఓఎం సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్ర విభజన బిల్లును రూపొందిస్తారు. మంత్రివర్గం ఆమోదించే బిల్లు ముసాయిదాను రాష్ట్రపతికి పంపించాల్సి ఉంది. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా తిప్పిపంపాలనే ఆదేశంతో రాష్ట్రపతి దానిని రాష్ట్ర శాసనసభకు పంపుతారని, అసెంబ్లీ అభిప్రాయాలతో కేంద్రానికి తిరిగి వచ్చే బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాదీ నవంబర్ మూడవ వారంలో ప్రారంభమై డిసెంబర్ 24లోగా ముగిసే శీతాకాల సమావేశాల షెడ్యూలులో ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల దృష్ట్యా స్వల్పమార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు.