కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం
సాక్షి, హైదరాబాద్ : దేశ చరిత్రలో జీడీపీ ఇంతగా పడిపోయిన సందర్భం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం వాపోయారు. గురువారం కేంద్ర బడ్జెట్ 2020 -21 పై ముఫ్ఖం జాహ్ కళాశాలలో చిదంబరం ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, జీడీపీ ఇంతలా దెబ్బతినడానికి నోట్ల రద్దు మొదటి కారణమైతే, జీఎస్‌టీ రెండవ కారణమని తెలిపారు. ఐసీయూలో ఉన్న ఆర్థిక వ్యవస్థను బయటకు తెచ్చే ఆలోచన కేంద్రం చేయడం లేదన్నారు. ఏ ఒక్క రంగంలో కూడా పూర్తి స్థాయిలో ట్యాక్స్‌లు వసూలు చేయలేకపోయిందన్నారు. అన్ని రంగాల్లో వృద్ధి లేదు కాబట్టే పన్ను వసూలు విషయంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిందని తెలిపారు.
సబ్ కా సాత్... సబ్ కా వికాస్ అనే కేంద్రం పేదల ఫుడ్ సెక్యురిటీ నిధుల్లో కూడా కోతలు పెట్టిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని, ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అని మండిపడ్డారు. ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీంకి కూడా నిధుల కోత పెట్టిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజారిటీ కట్టబెట్టారని, తప్పటడుగులు వేయోద్దని అన్నారు. హైదరాబాద్లో రోడ్డువెంట ఉన్న బ్రాండెడ్ కంపెనీల షో రూమ్స్‌లో కస్టమర్లు లేకుండానే కనిపించారని, ఇదే పరిస్థితి చెన్నైలో కూడా ఉందని పేర్కొన్నారు.
కస్టమర్లు లేకపోవడానికి ప్రధాన కారణం ప్రజల వద్ద డబ్బులు లేకపోవడవమే అని అన్నారు. ఆటో మొబైల్ రంగం బాగుంటేనే దేశ ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆటో మొబైల్ రంగం నాలుగు రోజులే పని చేస్తోందని అన్నారు. చాలా మంది వ్యాపార వేత్తలు టాక్స్ వేధింపులకు గురవుతున్నారని అన్నారు. టాక్స్ చెల్లింపు దారులకు ప్రస్తుతం వేధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment