ఉద్యమాలతో పేదరికాన్ని తొలగించలేము:చిదంబరం
పనాజీ: ఉద్యమకారులపై కేంద్రమంత్రి పి.చిదంబరం నోరు పారేసుకున్నారు. ఉద్యమకారులు అదే పనిగా ఆందోళన చేపట్టడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని ఆయన కొత్త భాష్యం చెప్పారు. గోవాలోని థింక్ ఫెస్ట్ ఈవెంట్ కు ఆదివారం హాజరైన చిదంబరం పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాలతో దేశంలోని పేదరికాన్ని తొలగించలేమని తెలిపారు. అసలు ఉద్యమాలతో పేదరికం పెరుగుతుందే తప్ప దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు.
విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, బొగ్గు గనుల ప్రాజెక్టుల పనులు జరగకుండా ఆందోళన చేపట్టడం ఉద్యమకారులకు తగదని ఆయన హితవు పలికారు. వాటి వల్ల నష్టం తప్పే, లాభం ఏమీ ఉండదన్నారు. ఉద్యమాలతో ఎవరైనా పేదరికాన్ని తగ్గించగలరా?అని ఆయన సవాల్ విసిరారు. ఆందోళన కారులు ప్రభుత్వానికి తగిన సలహాలు ఇస్తూ మరింత ముందుకెళ్లేందుకు సహకరించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పథంలో పయనించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు.