సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విధివిధానాలను ఖరారు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సోమవారం తొలిసారిగా సమావేశమైంది. అయితే, తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునితో ఏర్పాటైన జీఓఎం సమావేశానికి ముగ్గురు మాత్రమే హాజరు కావడంతో పరిశీలనాంశాలపై ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి పి.చిదంబరం, సిబ్బంది శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి మాత్రమే పాల్గొన్నారు. ఈ కమిటీ సభ్యుడైన మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి పల్లంరాజు మంత్రి పదవికి రాజీనామా సమర్పించినందున ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. రాష్ట్రవిభజన ప్రక్రియలో రెండు రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను నిర్ణయించడంతో పాటు ఆస్తులు, అప్పుల పంపకం, సిబ్బంది, నిధుల కేటాయింపులు, జలవనరులు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీతో పాటు ఉమ్మడి రాజధాని నగర పరిపాలనా వ్యవస్థ స్వరూప స్వభావాలు, అన్ని ప్రాంతాల ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడం, తగిన భద్రత కల్పించడం వంటి పలు అంశాలను లోతుగా అధ్యయనం చేసి మంత్రుల బృందం ఆరు వారాల్లో కేంద్ర మంత్రివర్గానికి నివేదించా ల్సి ఉంది.
జీఓఎం అధ్యయనం చేయాల్సిన వివిధ అంశాలపై ఆయా మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులైన నిపుణులతో కూడిన ఉపసంఘాలను ఏర్పాటు చేసే విషయమై ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గానికి జీఓఎం సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్ర విభజన బిల్లును రూపొందిస్తారు. మంత్రివర్గం ఆమోదించే బిల్లు ముసాయిదాను రాష్ట్రపతికి పంపించాల్సి ఉంది. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా తిప్పిపంపాలనే ఆదేశంతో రాష్ట్రపతి దానిని రాష్ట్ర శాసనసభకు పంపుతారని, అసెంబ్లీ అభిప్రాయాలతో కేంద్రానికి తిరిగి వచ్చే బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాదీ నవంబర్ మూడవ వారంలో ప్రారంభమై డిసెంబర్ 24లోగా ముగిసే శీతాకాల సమావేశాల షెడ్యూలులో ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల దృష్ట్యా స్వల్పమార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు.
విభజనపై చర్చకు వచ్చిన మంత్రులు ముగ్గురే
Published Tue, Oct 8 2013 2:33 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement