షిండేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఈ ఉదయం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతల బృందం ఉదయం 10.30కు షిండేను కలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని షిండేకు టీ కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతమున్న 119 నుంచి 153కు పెంచాలని అందులో పేర్కొనున్నారు.
తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కొత్తరాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని షిండేకు శశిథర్రెడ్డి ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే. తెలంగాణ పరిధిలో 17 లోక్‌సభ సీట్లు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని రాజకీయ అస్థిరతకు ఆస్కారం లేకుండా సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో రెండేసి చొప్పున అదనంగా 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేయాలని, దీనితో సీట్ల సంఖ్య 153కు పెరుగుతుందని తన లేఖలో తెలిపారు.