తెలంగాణ వస్తే రాత్రికి రాత్రి అంతా మారిపోదు: మర్రి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం షిండేను కలిసి తెలంగాణలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజవర్గాల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని షిండేని కోరామని, చిన్న రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత్వాన్ని పోగొట్టడానికే ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. తాము పది జిల్లాలలో కూడిన హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణనే కోరుతున్నామని మర్రి స్పష్టం చేశారు.
నాగాలాండ్ లాంటి చోట ఒక్క పార్లమెంట్ స్థానంలో 60 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వస్తే రాత్రికి రాత్రి అంతా మారిపోతుందనుకోవద్దని ఆయన అన్నారు. చాలా సమస్యలు ఉంటాయని.... వాటిని పరిష్కరించడానికి ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ స్థానాలు పెంచాలనే ప్రతిపాదనపై టీఆర్ఎస్లోని ఓ ముఖ్యనేత తనతో మాట్లాడి.... మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా తెలంగాణలోని అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయటం సాధ్యమేనని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.