సాక్షి, భోపాల్ : బీజేపీ భోపాల్ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ప్రచారంపై ఈసీ 72 గంటల నిషేధాన్ని విధించడంతో ఆమె గురువారం ఆలయ సందర్శనలకు సమయం వెచ్చించారు. ఆమె ఉదయం తన రివేరా టౌన్ నివాసంలో ప్రజలను కలుసుకున్న అనంతరం భోపాల్‌లోని కర్ఫ్యూ వలి మాతా మందిర్‌ను సందర్శించారు. కాగా, బాబ్రీ మసీదు విధ్వంసంలో తన పాత్రతో పాటు ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కింద పరిగణించిన ఈసీ ఆమెపై 72 గంటల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
హేమంత్ కర్కరేపై ప్రకటనకు సాధ్వి క్షమాపణలు కోరినా ఈసీ ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇక సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలకు గాను సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఈసీ మూడో నోటీసు జారీ చేసింది. ఉగ్రవాదిని ఓ సన్యాసి అంతమొందిచాల్సిన అవసరం ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. భోపాల్‌లో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌పై మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ బరిలో దింపినప్పటి నుంచి ఆమె వివాదాలకు కేంద్రబిందువుగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment