సాక్షి, కరీంనగర్: టీఆర్‌ఎస్ టికెట్ తనకే కేటాయిస్తారనే ఆశతో వేచిచూసిన చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్‌లోనే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. చొప్పదండితో పాటు మరికొన్ని స్థానాలను పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి చొప్పదండి స్థానాన్ని తనకు కేటాయించకుండా పెండింగ్‌లో ఉంచడంపై .. శోభ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చొప్పదండి సీటు దక్కించుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించినప్పటికి.. టీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన వెలువడలేదు.
నేడో, రేపో కేసీఆర్ చొప్పదండి టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించనుండగా.. శోభకు టికెట్‌పై ఎటువంటి హామీ లభించలేదు. దీంతో చొప్పదండి స్థానం నుంచి ఎలాగైన బరిలోకి దిగాలని భావిస్తున్న శోభ.. పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఆమె తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఆమె బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న తన అనుచరులతో సమావేశమై పార్టీ మారడంపై చర్చించిన ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. బుధవారం ఆమె తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment