అసామాన్య...సామాన్యుడు! | Bommagani Dharmabiksham Political Life Story | Sakshi
Sakshi News home page

అసామాన్య...సామాన్యుడు!

Published Fri, Mar 15 2019 10:09 AM | Last Updated on Fri, Mar 15 2019 10:09 AM

Bommagani Dharmabiksham Political Life Story - Sakshi

నల్లగొండ :విద్యార్థి నాయకుడు.. హాకీ టీమ్‌ కెప్టెన్‌.. ఆర్యసమాజ్‌ సారథి.. ఆంధ్ర మహాసభ ఆర్గనైజర్‌.. కార్మిక సంఘాల నాయకుడు.. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. కమ్యూనిస్టు.. జర్నలిస్ట్‌.. ఎమ్మెల్యే.. ఎంపీ.. ప్రజా జీవితమే పరమావధిగా ఆజన్మ బ్రహ్మచారిగా గడిపిన ఆదర్శ నేత.. వెరసి ఇన్ని లక్షణాలు.. రూపాలు అచ్చుబోస్తే.. బొమ్మగాని భిక్షం అలియాస్‌ బొమ్మగాని ధర్మభిక్షం..!. ధర్మాన్ని కోరిన విద్యార్థి నాయకుడిగా నాటి హైదరాబాద్‌ కొత్వాల్‌ రాజ్‌బహద్దూర్‌ వెంకటరామారెడ్డి భిక్షంకు పెట్టిన పేరు ధర్మభిక్షం..‘‘భిక్షం మాంగా ధర్మ్‌.. కియాఇన్‌కా నామ్‌ ధర్మ్‌భిక్షు హై..’’!  అన్న నాటి నుంచి ఆయన ధర్మభిక్షంగానే ప్రాచుర్యం పొందారు....::: ఎన్‌.క్రాంతీపద్మ

ఇదీ నేపథ్యం
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో గీతకార్మికుల ఇంట ఫిబ్రవరి 15, 1922న ధర్మభిక్షం జన్మించారు. ఆయన కుటుంబం సూర్యాపేటలో స్థిరపడింది. విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్న చైతన్య శీలి. విద్యార్ధి సంఘం నాయకుడిగా పనిచేశారు. తాను సొంతంగా నడిపిన హాస్టల్‌లోని విద్యార్థులను ఉద్యమంలోకి వచ్చేలా ఆర్గనైజ్‌ చేశారు. కార్మిక నాయకుడిగా.. వివిధ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి ఉద్యమించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, మూసీ ప్రాజెక్టుల నిర్మాణాల సమయంలో ఆయన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పోరాడారు. ఆర్యసమాజ్‌లో పనిచేసిన సమయంలో జీవహింసకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ తర్వాత ఆంధ్రమహాసభతో మమేకమయ్యారు. ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనే తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండల్లో పాత్రికేయునిగా కూడా పనిచేశారు.

విద్యార్థి జీవితం
ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను ధిక్కరించి సహ విద్యార్థులతో కలిసిబహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతి గృహం ఏర్పాటు చేశారు. సూర్యాపేటలోనే మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. తెలుగుతో పాటు ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు.

సాయుధ పోరాట యోధుడు
నిజాంపై సాయుధ పోరాటం మొదలైన తర్వాత తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధ పోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్టయ్యి.. ఔరంగాబాద్, జాల్నా జైళ్లో ఉన్నారు. మొత్తంగా అయిదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు. జాల్నా జైళ్లో ఏకంగా పదివేల మంది ఖైదీలతో సమ్మె చేయించిన ఘనత కూడా ఆయనదే. గీత పనివారల సంఘం నేతృత్వంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరి వరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మభిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు. సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి కంటే సీనియర్‌ అయిన ధర్మభిక్షం, సాయుధ పోరాటంలో మాత్రం ఇద్దరూ కలిసి ఒకేసారి పాల్గొన్నారు. బీఎన్‌ అజ్ఞాత జీవితం గడపగా, ధర్మభిక్షం జైలు జీవితం ఎక్కువ కాలం గడిపారు.

రాజకీయ జీవితం
స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు 1957లో నకిరేకల్‌ నుంచి, 1962లో నల్లగొండ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. భారత ప్రభుత్వం నుంచి తామ్ర పత్ర పురస్కారం అందుకున్నారు. గ్రామీణ పేదల హక్కుల కోసం యువత, విద్యార్థులు, అసంఘటిత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు నడిపారు. స్వాతంత్య్ర సమరయోధునిగానూ ఆయనది అసమాన పాత్ర. నల్లగొండలో పలు కార్మిక సంఘాలను స్థాపించారు. 1991–1996 మధ్య పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ (గ్రామీణాభివృద్ధి శాఖ) సభ్యులుగా పనిచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement