విజయనగరం గంటస్తంభం: రాజధాని అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, దానిపై విచారణ జరిపేందుకే ‘సిట్’ను నియమించినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 24వ తేదీన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి బొత్స సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో అక్రమాలు, దోపిడీ జరగలేదని, దమ్ముంటే విచారణ చేయాలని గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నారని గుర్తుచేశారు. విచారణ చేసేందుకు ‘సిట్’ వేస్తే ఇప్పుడు కక్షపూరితం అంటున్నారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి కోసం రూ.17,800 కోట్లుతో టెండర్ వేసి, అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్కీవ్స్ ఫీజ్ కింద రూ.842 కోట్ల చెల్లింపులు చేసేందుకు ఒప్పందం చేసుకుని, రూ.300 కోట్లకుపైగా చెల్లించారన్నారు. దీనిపై విచారణ జరిపిస్తున్నామన్నారు. వాస్తవాలను నిర్ధారించేందుకు ‘సిట్’ వేసినట్టు వెల్లడించారు.
కులాలు, పార్టీల వారీగా చట్టాలు తెచ్చుకోవాలా?
ఈఎస్‌ఐ కుంభకోణంలో బీసీ మంత్రిని కావున టార్గెట్ చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వాఖ్యలను మంత్రి బొత్స తప్పుబట్టారు. గతంలో అసెంబ్లీలో టీడీపీ నాయకులు తనను ఉద్దేశించి ఎన్నో మాటలన్నారని, అప్పుడు నేను బీసీ మంత్రిని కాదా? అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నవారే బీసీలా? అని నిలదీశారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. కులాలు, పార్టీల వారీగా చట్టాలు తెచ్చుకోవాలా? అని వ్యాఖ్యానించారు. అక్రమాలు గురించి మాట్లాడితే ప్రధానమంత్రి పేరు చెబుతున్నారని, అక్రమాలు చేయమని ఆయన చెప్పారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఒక విధానం చెబుతుందని, దోచేయాలని చెప్పదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment