
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలో పొత్తుల ప్రస్తావనే రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని.. ఎంత దూరమైనా వెళ్తామని తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్-కేటీఆర్ భేటీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్నటి (బుధవారం) భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రమే చర్చించారని, పొత్తుల గురించి కాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్ అన్యాయం చేసుంటే.. ఆ రాష్ట్ర ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం టీడీపీ ఎందుకు ప్రయత్నించిందని ప్రశ్నించారు.
ఒడిషా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ సీఎంలను ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ కలిశారని, ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌ను టీఆర్‌ఎస్ నేతలు కలిశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే తమ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పదేళ్లు హైదరాబాద్‌లో రాజధాని కొనసాగే అవకాశం ఉన్నా ఎందుకు ముందుగానే వచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ నేతల వక్రబుద్ధిని రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని, శాంతిభద్రతలపై నమ్మకం లేకుండా చేశారని టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతల మాటలకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఉందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment