సాక్షి, అమరావతి: కృష్ణా జలాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అర్థం కాకపోవడంతోనే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తన పాలనలో ఏనాడూ సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. అసెంబ్లీలో ఈ అంశంపై బుగ్గన మాట్లాడుతూ ఏమన్నారంటే.. ‘ టీడీపీ సభ్యులు ప్రతిసారి ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ (ఐఏ) వేసిన దాన్నే ప్రస్తావిస్తున్నారు. మనకు కృష్ణా జలాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూటీ-1) బచావత్ అవార్డులో నదీ జలాలను 2,130 టీఎంసీలుగా నిర్ధారించి.. ఏపీకి 800కుపైగా టీఎంసీలు, కర్ణాటకకు 700కుపైగా టీఎంసీలు, మహారాష్ట్రకు 500కుపైగా టీఎంసీల నీటిని కేటాయించారు. అంతకుమించి వచ్చే మిగులు జలాలకు సంబంధించి, ప్రాజెక్టులు కట్టుకుంటే వాటికి హక్కు రాదని బచావత్ అవార్డులో స్పష్టం చేశారు. ఆ తర్వాత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఏదీ పట్టించుకోలేదు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, ఆ పనులు మొదలుపెట్టడంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కోర్టుతోపాటు, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. మిగులు జలాలపై ఎలాంటి హక్కు లేనప్పుడు ప్రాజెక్టులు ఎలా చేపడతారని ఆ రాష్ట్రాలు ప్రశ్నించాయి. దీంతో అప్పుడు ప్రభుత్వం ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ (ఐఏ) వేసింది. తమకు మిగులు జలాలపై హక్కు లేదని, ఆ విషయం అంగీకరిస్తున్నామని, అయినప్పటికీ 5 ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది. వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి వంటి ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఆ ప్రాజెక్టులకు కోర్టు, ట్రిబ్యునల్ అడ్డుపడకుండా ఉండాలంటూ, బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కోట్ చేస్తూ, దాన్నే చూపుతూ, ఆ చట్టం పరిధిలోనే అప్పుడు వైఎస్సార్ ప్రభుత్వం ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది’ అని బుగ్గన వివరించారు.
‘ఇక రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి టీడీపీ చేసిన పనులు చూస్తే.. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.5 వేల కోట్లు కాగా, 9 ఏళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.13 కోట్లు మాత్రమే. అదే ప్రాజెక్టుపై దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూ.3 వేలకోట్లకుపైగా ఖర్చు చేసింది. ఇంకా గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టుపై 2004 నుంచి 2014 వరకు చేసిన ఖర్చు రూ.5036 కోట్లు చేయగా, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుపై రూ.6593 కోట్లు ఖర్చు చేశారు. అయితే అందులోనూ నిజానికి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమే 2004-09 మధ్య ఆ ప్రాజెక్టులపై చాలా ఖర్చు చేసింది. రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఆ ప్రాజెక్టులపై ఒకవేళ దృష్టి పెట్టి ఉంటే, కేవలం ఒక ఏడాదిలోనే అవి పూర్తయి ఉండేవి’ అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
చంద్రబాబే సమాధానం చెప్పలి
రాయలసీమ ప్రాజెక్టుల గురించి టీడీపీ నేతల ప్రశ్నలకు చంద్రబాబే సమాధానం చెప్పాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. గండికోట ప్రాజెక్టులో నీరు ఎందుకు నింపలేదని ప్రజలు అడుగుతున్నారని, ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రాజెక్టుల కాలువలకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులకు భూసేకరణ చేసి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఉంటే నీరు నిల్వ ఉండేవాళ్లమని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులు ఆయనను కలిసేందుకు వెళ్లినా పట్టించుకోలేదని, అరెస్టులు చేయించి.. కేసులు పెట్టించారని గుర్తు చేశారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి రాయలసీమలో మూడు సీట్లే ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. పొత్తిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టింది వైఎస్సారేనని కొనియాడారు. రాయలసీమను అన్నిరకాలుగా ఆదుకోవాల్సిన టీడీపీ ఆ రోజు నిద్రపోయిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment