మీడియాతో బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్ వాళ్లే లబ్ధి పొందుతున్నారని, కానీ వారి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీని సింగపూర్ కంపెనీలకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు. గత నాలుగేళ్లలో ఆరు పర్యాయాలు సింగపూర్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని బుగ్గన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. సింగపూర్ సదస్సుకు చంద్రబాబును ఎవరూ పిలువలేదన్నారు. కానీ టికెట్టు కొనుక్కుని మరీ చంద్రబాబు ఆ సదస్సుకు వెళ్లారని తెలిపారు. అమరావతిలో అందరూ ఎలక్ట్రిక్ బైక్స్‌లో తిరుగుతున్నట్లు చంద్రబాబు సింగపూర్‌లో ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ విదేశీ పర్యటనలు చేసింది చంద్రబాబేనని, కానీ వాటి వల్ల రాష్ట్రానికి ఖర్చులు తప్ప ఏపీకి ఏ ప్రయోజనం చేకూరలేదన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెడుతూ మాటలతో ఏపీ ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేశానని సమావేశాల్లో రైతులతో బలవంతంగా పలికిస్తూ ఆ విషయాలను వారి అనుకూలమైన మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అర్థంకాని రీతిలో మాట్లాడే కళ చంద్రబాబులో ఉందని ఎద్దేవా చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మంత్రి యనమల రామకృష్ణుడిని తోడు ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు.
మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వెళ్లాల్సిన సమావేశాలు, కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావడమే తప్పు అయితే ఆయన వెంట మంది మార్భలంతో వెళ్లడం సరికాదని హితవు పలికారు. తనకు ధైర్యం చెప్పేందుకే యనమలను చంద్రబాబుకు ఆయన వెంట తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాణిజ్యం సులభంగా చేయడంలో ఏపీ నంబర్ వన్ అని ఊదర గొడుతున్నారని తెలిపారు. రాష్ట్రం బాగుపడితే అందరూ మద్దతిస్తారని, టీడీపీ చేసే తప్పుడు ప్రచారంతో ఏపీ పరువు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016–2017లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందని ప్రచారం చేసుకుంటున్నారు గానీ ఎన్ని కంపెనీలు ఏపీకి వచ్చాయో.. వాటి ద్వారా ఎన్నికోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు.
ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు లాక్కుని టైటిల్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. 30 అంతస్తుల మల్టీస్టోర్‌డ్ బిల్డింగ్‌ల నిర్మాణం కృష్ణానది ఒడ్డున సాధ్యమేనా అని ప్రశ్నించారు. జైపూర్‌లో 120 కోట్ల రూపాయలతో 17 ఎకరాల్లో అద్భుతమైన అసెంబ్లీ కట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాలుగేళ్లలో కట్టిందే ఓ తాత్కాలిక భవనం.. అందులోనూ వర్షం కురిస్తే లోపలకు నీళ్లు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా ఉన్నందువల్లే నాగాలాండ్‌కు పెట్టుబడులు పెరిగాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment