చంద్రబాబుకు అమెరికా, ఫారెన్ పిచ్చి: బుగ్గన
హైదరాబాద్ : రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు అమెరికా, ఫారిన్ పిచ్చి పట్టుకుందని బుగ్గన ఎద్దేవా చేశారు. సింగపూర్ చేసేది ప్లాట్ల వ్యాపారమేనని, ప్లాట్ల వ్యాపారం చేయటానికి సింగపూర్ కంపెనీలు అవసరం లేదని అన్నారు. రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని ప్రభుత్వం వ్యాపారం చేస్తోందన్నారు. చరిత్రలో ఇంత పెద్ద కుంభకోణం ఎప్పుడు జరగలేదని బుగ్గన విమర్శించారు.
రైతుల భూమి తీసుకుని 12 నుంచి 15వేల కోట్లు ఖర్చుపెట్టి సింగపూర్కు అతి చౌకగా భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. కేవలం రూ.300 కోట‍్లు ఖర్చుపెట్టే సింగపూర్కు 58శాతం వాటా ఇచ్చి, రూ.15 వేలకోట్లు ఖర్చుపెట్టే ప్రభుత్వం 48 శాతం వాటా తీసుకుంటుందనటం హాస్యాస్పదంగా ఉందని బుగ్గన అన్నారు. ఎలాంటి బాధ్యత లేని సింగపూర్కు వేలకోట్ల లబ్ది చేకూర్చుతారా అని ఆయన అడిగారు. భారతీయ కంపెనీలను చంద్రబాబు తీవ్రంగా అవమానిస్తున్నారని, మనవాళ్లు గాడిదలు, విదేశీయులు గుర్రాలా అని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ మన కంపెనీలను గాడిదలతో...విదేశీ కంపెనీలను గుర్రాలతో పోల్చారని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతీయులన్నా, భారతీయ కంపెనీలన్నా ఎందుకంత చులకని అని ప్రశ్నించారు.
స్విస్ చాలెంజ్ విధానాన్ని హైకోర్టు తప్పుబట్టిందని, కోర్టులు తప్పుబట్టాయనే కారణంగానే ఏకంగా చట్టాన్ని సవరిస్తున్నారని బుగ్గన అన్నారు. స్విస్ చాలెంజ్ నిబంధనలను మార్చాల్సిన అవసరం ఏంటని, చట్టాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నలు సంధించారు. స్విస్ చాలెంజ్ నిబంధనల్లో ఎక్కడా పారదర్శకత లేదన్నారు. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. ఆయన గందరగోళానికి ఉద్యోగులు కూడా పని చేయలేక పారిపోతున్నారని బుగ్గన అన్నారు.