
సాక్షి, న్యూడిల్లీ : మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు బైరెడ్డి కుమార్తె శబరి, కౌశల్ సతీమణి నీలిమ బీజేపీ చేరినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వారిని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని తెలిపారు. దేశంలో పరిస్థితులు బాగుపడాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థ రాజకీయాలు అవసరం అని అభిప్రాయపడ్డారు. అందుకోసమే తాను బీజేపీలో చేరారని వెల్లడించారు. త్వరలోనే కర్నూలులో బహరింగ సభ నిర్వహిస్తామని.. ఆ సభకు రావాల్సిందిగా జేపీ నడ్డాను కోరినట్టు చెప్పారు.
కౌశల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు దేశం కోసం పనిచేస్తున్న తీరు ఆకట్టుకుందని తెలిపారు. వారి నాయకత్వంలో పనిచేయడం కోసం బీజేపీలో చేరినట్టు చెప్పారు.